ఈ వారం నుంచి చైనా జాతీయులకు భారతదేశ పర్యాటక వీసాల జారీ ప్రక్రియ ఆరంభవుతుంది. ఐదేళ్ల తరువాత ఈ టూరిస్టు వీసాల పునరుద్ధరణ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీని మేరకు ప్రభుత్వం బుధవారం ప్రకటన వెలువరించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సజావు ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణ తరువాతి క్రమంలో భారత్ చైనా మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.
కోవిడ్ మహమ్మారితో 2020లో భారతదేశం చైనా నుంచి పర్యాటకుల రాకపై నిషేధం విధించింది. తరువాత ఈస్టర్న్ లడ్ధఖ్ ఘర్షణతో ఈ ఆంక్షలు కొనసాగాయి. ఇప్పుడు ఈ నిషేధం తొలిగిపోయిందని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. గురువారం నుంచి చైనా జాతీయులు భారతీయ టూరిస్ట్ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని బీజింగ్‌లోని భారతీయ రాయబార కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామంపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ హర్షం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య ప్రజల రాకపోకలకు ఇది దారితీస్తుందని ప్రకటనలో తెలిపారు.