Thursday, July 10, 2025

కదిలిన కార్మికలోకం

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఒక్కరోజు హర్తాళ్ బుధవారం పలు ప్రాంతాలలో జరిగింది. పారిశ్రామికవాడల ప్రాంతాల్లో ప్రభావం కనపడింది. అయితే ఎక్కడ కూడా సాధారణ జనజీవితం చెక్కుచెదరలేదు. అయితే పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలలో చెదరుమదురు హింసాత్మక ఘటనలు జరిగినట్లు స్థానిక అధికారుల సమాచారం మేరకు వెల్లడైంది. అయితే తమ సమ్మె విజయవంతం అయిందని కార్మిక సంఘాల నేతలు ఢిల్లీలో ప్రకటించారు. తంతితపాలా, బ్యాంకులు, బీమా గనుల రంగంలో అత్యధిక సంఖ్యలో కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. దీనితో ఆయా రంగాలపై స్వల్పస్థాయిలో ప్రభావం పడింది. పలు ప్రాంతాలలో బంద్ వంటి పరిస్థితి నెలకొందని పది ట్రేడ్‌యూనియన్లు ప్రకటించాయి. రాజస్తాన్, తెలంగాణ, హర్యానా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో బంద్ ప్రభావం పాక్షికంగానే ఉంది. అయితే బీహార్, కేరళ, బెంగాల్, కర్నాటక ఇతర చోట్ల బంద్ ప్రభావం పడిందని అధికారులు తెలిపారు.

నాలుగు కార్మిక చట్టల ఎత్తివేత, కాంట్రాక్టు పద్ధతి తీసివేత, పిఎఎస్‌యుల ప్రైవేటీకరణ వంటి ఇతరత్రా సమస్యలపై కార్మిక వర్గాలు సమ్మెకు దిగాయి . పలు విధాలుగా దినసరి వ్యయం పెరుగుతూ పోతున్నా, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నా మునుపటి రీతిలోనే వేతనాలు భత్యాలు ఉన్నాయని, దీనితో కార్మికుల దైనందిన జీవితాలు దిగదిడుపు అవుతున్నాయని కార్మిక సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం యధావిధిగా మార్కెట్లు తెరిచే ఉన్నాయి. జనజీవితం సాఫీగా సాగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఐఎన్‌టియుసి, సెవా, ఎల్‌పిఎఫ్, యుటియుసి, ఎఐటియుటిసి, హెచ్‌ఎంఎస్, సిఐటియు, యుటియుసి వంటి కార్మిక సంఘాలు సమ్మె పిలుపు ఇచ్చాయి. పలు ప్రాంతాలలో రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు కూడా సమ్మెలో పాక్షికంగా పాల్గొన్నారు. దీనితో ప్రజా రవాణా వ్యవస్థ కొద్దిగా కుంటుపడింది. అయితే ఇతరత్రా రవాణా సాధనాలతో జనం రాకపోకలు యధావిధిగా సాగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News