న్యూఢిల్లీ: పహల్‌గామ్ ఉగ్రవాద దాడిలో పాక్ ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఈ పైశాచిక దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట దాడి జరిపి పాకిస్థాన్, పిఒకెల్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో భారత గగనతలంలోని కొంత మేర కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కూడా 165 సర్వీసులను మే 10వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అమృత్‌సర్, బికనేర్, చంఢీగఢ్, ధర్మశాల, గ్వాలియర్, జమ్మూ, జోధ్‌పూర్, కిషన్‌గఢ్, లేహ్, రాజ్‌కోట్, శ్రీనగర్ సహా పలు ఎయిర్‌పోర్టుల నుంచి మే 10వ తేదీ ఉదయం 10 గంటల వరకూ 165కి పైగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులు అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చూసుకోవాలని.. తమ ప్రయాణాన్ని రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేసుకొనే సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. దీనికి ఎటువంటి ఛార్జీలు లేవని, రద్దు చేసుకుంటే.. పూర్తి రీఫండ్ ఇస్తామని తెలిపింది.