ఇస్లామాబాద్ : పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్‌పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ దాడి తర్వాత పాక్ జీవనాడులను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అందులో సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత కూడా ఒకటి. దీని గురించి మాట్లాడుతూ తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రేలాపనలు చేశారు. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ అవాకులు చవాకులు పేలారు.
ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ఇరుదేశాల మధ్య వైషమ్యాలు తారస్థాయికి చేరాయి. అయితే ఇందుకు ప్రతిగా నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడ ం ఇదే ప్రథమం. పాకిస్థాన్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం నిలిపివేతపై పాక్ మాజీ విదేశాంగ మంత్రి , పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో జర్దారీ సింధూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ మాట్లాడారు.