Home సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు వి.వి. వినాయక్

ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు వి.వి. వినాయక్

సాయిధరమ్ తేజ్ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ చిత్రం టీజర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, వి.వి.వినాయక్, సి.కళ్యాణ్, రచయిత శివ ఆకుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ “సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న నాలుగవ చిత్రమిది. వినాయక్ దర్శకత్వంలో ఇంతకుముందు ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా చేశాను. మళ్లీ మన కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడని ఆయనను అడుగుతుంటాను. ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు వి.వి.వినాయక్. ఆయన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో నట వారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ సినిమా విషయానికొస్తే వినాయక్, శివ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. టీజర్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు చూడాలా అని అనిపిస్తుంది. టైటిల్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా యూత్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది”అని అన్నారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ “వినాయక్, నేను కలిసి ఓ సినిమా చేయాలని వినాయక్ నాన్నగారు కృష్ణకు ఓ కోరిక ఉండేది. ఇప్పుడు ఈ చిత్రంతో వినయ్ ఆ కోరికను తీర్చాడు.  తేజు ఈ సినిమా ఎంతో కష్టపడి చేశాడు. ‘ఇంటిలిజెంట్’తో మంచి హిట్ కొట్టబోతున్నాం”అని చెప్పారు. హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ “కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో బాలకృష్ణ ఎప్పుడు ముందు ఉంటారు. మా సినిమాకు ఆశీస్సులు అందించడానికి ఆయన రావడంతో అది మరోసారి నిరూపించబడింది”అని తెలిపారు. రచయిత శివ ఆకుల మాట్లాడుతూ “భారతం, భాగవతాలను అవపోసన పట్టిన నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా కథను రూపొందించడం జరిగింది. సమస్యనైనా, సందేశాన్నయినా సరదాగా చెప్పాలని వినాయక్ ఎప్పుడూ అంటూ ఉంటారు. అలా వినోదాత్మకంగా సి.కళ్యాణ్ బ్యానర్‌లో ఈ సినిమాకు కథ, మాటలు అందించడం నాకు ఎతో సంతృప్తిని కలిగించింది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది”అని అన్నారు. ఇక ఫిబ్రవరి 4న ‘ఇంటిలిజెంట్’ ప్రీ రిలీజ్ వేడుకను రాజమండ్రిలోని గవర్న్‌మెంట్ ఆర్ట్ కాలేజీలో ఘనంగా నిర్వహించనున్నారు. సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః ఎస్.వి.విశ్వేశ్వర్, సంగీతంః తమన్, ఎడిటింగ్‌ః గౌతంరాజు, ఆర్ట్‌ః బ్రహ్మ కడలి, ఫైట్స్‌ః వెంకట్, డ్యాన్స్‌ః శేఖర్, జాని.