బీహార్లో భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) ఓటర్ల జాబితాలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఇంటింటికీ బృందాలు సందర్శించినప్పుడు నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చి వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించినట్లు ప్రకటించింది. 2025 సెప్టెంబర్ 30న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఈ వ్యక్తుల పేర్లను చేర్చబోమని ఇసిఐ స్పష్టం చేసింది. ఈ పరిణామాల పట్ల వాడి, వేడి చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియ చేపట్టిన సమయం, ఉద్దేశం, ఇందుకు దారితీసిన రాజకీయ ప్రేరణలు పలు ప్రశ్నలను లేవదీస్తున్నాయి. ముఖ్యంగా అసోం ఉద్యమం వంటి చారిత్రక సంఘటనలు, భారతదేశ పౌరసత్వ విధానాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ, వివాదాలు బీహాల్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) 2025 జూన్ 25న ప్రారంభమైంది. జులై26 నాటికి ఓటర్లనుంచి ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సేకరించే పనిని బూత్ లెవెల్ అధికారులకు అప్పగించారు. ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానున్నది. ఆ తర్వాత అభ్యంతరాలు క్లెయిమ్‌లను స్వీకరించేందుకు కొద్దిగా వ్యవధి ఉంటుంది. ఓటరు ధ్రువీకరణకోసం ఎన్నికల కమిషన్ (Election Commission verification) 11 ఆమోదయోగ్యమైన పత్రాలను పేర్కొంది. వీటిలో ఆధార్, ఎన్నికల కమిషన్ జారీచేసిన ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులను మినహాయించడం వివాదాస్పదమైంది.అయితే, ఎస్‌ఐఅర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు జులై 10న ఈ మూడు పత్రాలను కూడా చెల్లుబడి అయ్యే రుజువులుగా పరిగణించాలని ఇసిఐని కోరింది.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు కొద్ది రోజుల ముందు, జులై 28న సుప్రింకోర్టు తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రక్రియపై అనిశ్చిత పరిస్థితి నెలకొంది. దాదాపు అందరివద్ద విస్తృతంగా ఉండే ఆధార్, రేషన్ కార్డులను మినహాయించడం ఆశ్చర్యకరం. ముఖ్యంగా వీటిని మన దేశంలో అంతటా గుర్తింపు ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తారు. ఇసిఐ అనుసరిస్తున్న విధానం వల్ల అట్టడుగు వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతుందని విమర్శకులు వాదిస్తున్నారు. ఎందుకంటే, ఎన్నికల కమిషన్ పేర్కొన్న మిగతా పత్రాలు వారివద్ద ఉండకపోవచ్చు. ఆధార్, రేషన్ కార్డులను చేర్చాలనే సుప్రీం కోర్టు సూచన ఈ ఆందోళనను ప్రతిబింబిస్తోంది. అయితే అనర్హమైనదిగా భావించే ఏ డాక్యుమెంట్‌నైనా తిరస్కరించే అధికారం ఇసిఐకి ఉందని కూడా కోర్టు పేర్కొంది.
అసోం ఉద్యమం కొన్ని పోలికలు : అసోంలో 1979- 1985 మధ్య ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ (ఆసు) సాగించిన ఉద్యమంతో బీహార్ ఎస్‌ఐఆర్‌కు కొన్ని పోలీకలు కనిపిస్తున్నాయి. అప్పట్లో మంగళ్ దోయ్ లోక్‌సభ ఉపఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితాలో విదేశీ పౌరుల పేర్లు, ముఖ్యంగా బంగ్లాదేశ్ వలసదారుల పేర్లు ఉన్నాయని ఆసు ఆరోపించింది. దాదాపు ఆరేళ్లు కొనసాగిన ఆందోళన 1985లో అసోం ఒప్పందంతో ముగిసింది. నిజానికి అక్రమ వలసదారులను గుర్తించి, బహిష్కరించాలనే లక్ష్యంతోనే ఇది సాగింది. అయితే ఈ ప్రక్రియలో పలు సవాళ్లు ఎదురయ్యాయి. ఆ తర్వాత అసోంలో జరిగిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియ 19 లక్షల మందిని మినహాయించింది వీరిలో చాలా మంది హిందువులు.
అందువల్లనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సిని తిరస్కరించి, దాని సవరణ కోసం ఒత్తిడి, చేసింది. అసోం అనుభవం భారత సరిహద్దు రాష్ట్రాలలో విదేశీ జాతీయులను గుర్తించడంలో ఉన్న ఇబ్బందులను చెబుతోంది. ఈ రాష్ట్రాలలో పౌరులు, పౌరులు కాని వారిలో జాతి, భాషా, సాంసృ్కతిక పరమైన తేడాలు పెద్దగా ఉండవు, ఉన్నా అస్పష్టంగా ఉంటాయి. అసోం ఉద్యమం ప్రారంభమైనప్పటినుంచి దశాబ్దాల పాటు పరిశీలన తర్వాత కేవలం 100 మంది కంటే తక్కువ మంది బంగ్లాదేశ్ జాతీయులను బహిష్కరించారు. వలసల పరిష్కారంలో చెప్పే కబుర్లకు, వాస్తవాలకూ మధ్య తేడాను ఇది హైలైట్ చేస్తుంది. రాజకీయాలు, పౌరసత్వ సవరణ చట్టం కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి విదేశీపౌరులను గుర్తించి బహిష్కరించే అంశానికే ప్రాధాన్యం ఇస్తోంది.
అటు నేపాల్, ఇటు బంగ్లాదేశ్‌లతో సరిహద్దులు పంచుకునే అసోం, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ విధానం మరింత తీవ్రమైంది. అయితే బీహార్ ఎస్‌ఐఆర్ చేపట్టిన సమయం, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు గడువు మరీ తక్కువగా ఉండడం వల్ల ఎన్నికలలో అవకతవకలు జరగవచ్చుననే అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. ఓటర్ల జాబితానుంచి ఎంపిక చేసిన వర్గాలవారి పేర్లను తొలగించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల అధికార పార్టీ వ్యతిరేకించే వర్గాలవారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు. 2019లో అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మరో క్లిష్టపరిస్థితిని కల్పిస్తోంది. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ నుంచి పారిపోయి మనదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పార్శిలు, జైనులు, బౌద్ధులకు సిఎఎ భారత పౌరసత్వం మంజూరు చేస్తుంది.
అసోంలో జాతీయ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) చాలా మంది హిందువులను మినహాయిస్తే, అందుకు భిన్నంగా సిఎఎ హిందూ వలసదారులను రక్షించడానికి ముస్లింలను మినహాయిస్తున్నది. దీంతో ఇది మతపరమైన పక్షపాతం ఆరోపణలను ఎదుర్కొంటున్నది. బీహార్‌లో నేపాల్, బంగ్లా, మయన్మార్‌కు చెందిన వ్యక్తులను ఎస్‌ఐఆర్ గుర్తించింది. కాగా, అక్కడి సిఎఎ వల్ల చిక్కులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఈ చట్టం వల్ల ముస్లిమేతర వలసదారులే పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. మరికొందరు ఓటర్ల జాబితానుంచి తొలగించబడతారు. బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. న్యాయపరమైన ధోరణులు, ప్రజల విశ్వాసాలు బీహార్ ఎస్‌ఐఆర్ కేసులో సుప్రీం కోర్టు జోక్యంతో కొత్త ఆశావాదాన్ని రేకెత్తించింది. అయితే న్యాయ వ్యవస్థ అంతిమంగా అనుసరించే వైఖరిపై సందేహాలు లేకపోలేదు.
ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ దాఖలయ్యే కేసులలో కోర్టు ప్రారంభ పరిశీలనలో ఒక మాదిరిగా ఉండడం, తుది తీర్పులు పాలక పార్టీ ఎజెండాకు అనుకూలంగా ఉండడం పరిశీలకులు గమనించారు. ముఖ్యంగా రామమందిరం -బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు 2019లో ఇచ్చిన తీర్పు దీనికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. విచారణల సమయంలో, బాబ్రీ మసీదు కింద రామమందిరం ఉందని నిరూపించడానికి సుస్పష్టమైన నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవని సుప్రీం కోర్టు అంగీకరించింది. అయినా, కోర్టు తుదితీర్పులో భక్తుల చారిత్రక విశ్వాసాలను ఉదహరిస్తూ, వివాదాస్పద స్థలాన్ని రామమందిర నిర్మాణం కోసం హిందూ పక్షాలకు కేటాయించింది. తుది తీర్పు బిజెపి సిద్ధాంతపరమైన ఎజెండాకు అనుకూలంగా ఉందని చాలా మంది భావించారు.
దీంతో న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం, నిష్పాక్షికతలపై ప్రజలలో సందేహాలను మరింత పెంచింది. ఎస్‌ఐఆర్ సందర్భంలో న్యాయపరమైన, సమగ్ర ధ్రువీకరణ ప్రక్రియను నిర్థారించేందుకే కోర్టు జోక్యం చేసుకున్నదా లేక ఎన్నికల కమిషన్ విచక్షణకు వదిలి వేస్తుందా అన్న అనిశ్చితి కొనసాగుతోంది. తుది తీర్పులలో కార్యనిర్వాహక వ్యవస్థ ధోరణికి చెక్ పెట్టకపోవడంతో న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నది. నిజమైన ప్రక్షాళన జరిగేనా? ఓటర్ల జాబితా సమగ్రతను నిర్ధారించడానికి ఇసిఐ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమైనవే. ఓటర్ల జాబితాలో విదేశీ పౌరులను చేర్చడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పే. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలంటే వారిని గుర్తించి, తొలగించడం అవసరం. బీహార్‌లో ఎన్నికల కమిషన్ ఎస్‌ఐఆర్‌ను చివరిక్షణంలో చేపట్టడం, కొన్ని డాక్యుమెంట్లనే అంగీకరించడం, దాని ఉద్దేశాలపై ఆందోళన కలిగిస్తోంది.
ఈ ప్రక్రియ నిజమైన భారతీయ పౌరులను, ముఖ్యంగా అణగారిన వర్గాలను ఎన్నికలకు దూరం చేసే ప్రమాదం ఉంది. భారతీయ పౌరులను పొరపాటున బంగ్లాదేశ్‌కు బహిష్కరిస్తారనే భయాలను పెంచుతున్నాయి. సిఎఎ, సవరించిన ఎన్‌ఆర్‌సి కోసం బిజెపి ఆధ్వర్యంలోని విస్తృత ఎజెండా ఎస్‌ఐఆర్ ఎన్నికల సమగ్రత కన్నా, రాజకీయ అధికారాన్ని పటిష్టం చేసుకునేందుకే ఉండవచ్చునని సూచిస్తున్నది. ఈ సమస్యను విదేశీ చొరబాటుకు వ్యతిరేక పోరాటంగా చిత్రీకరించడం ద్వారా ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవచ్చు. ప్రతిపక్ష ఓటర్లు ఓటు హక్కు కోల్పోవచ్చు. భారతదేశంలో పేదల వద్ద కచ్చితంగా ఉండే ఆధార్, రేషన్ కార్డులను కాదనడం మాత్రం అనుమానాలను పెంచుతోంది.
జులై 28న సుప్రీం కోర్టు తుదితీర్పు జులై 28న సుప్రీం కోర్టు ఈ కేసును తిరిగి విచారించేందుకు సిద్ధమవుతుంటే, ఎన్నికల కమిషన్ ప్రతిపత్తి, స్వాతంత్య్రం, నిబద్ధతకు కీలక పరీక్ష ఎదుర్కొంటోంది. ఆధార్, ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులను రుజువుగా అంగీకరించడం వల్ల ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారవచ్చు. అదే సమయంలో అక్రమ వలసదారుల గుర్తింపులో నిజమైన పౌరులు చిక్కుకోకుండా చూడాలి, రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్‌ఐఆర్ దుర్వినియోగం కాకుండా చూసేందుకు స్వతంత్ర పర్యవేక్షమ అవసరం. బీహార్ తుది ఓటర్ల జాబితా కోసం ఎదురు చూస్తుండగా, ఇది ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయడానికి జరుగుతున్న నిజమైన ప్రయత్నమా లేక అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు జరుగుతున్న చర్యనా అని దేశం నిశితంగా గమనిస్తోంది.
- గీతార్థ పాఠక్, ఈశాన్యోపనిషత్
- రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు