రాజీవ్ యువ వికాసానికి అదే రోజు శ్రీకారం
దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
మన తెలంగాణ/కేసముద్రం: తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందకు మంత్రివర్గం రోజుకు 18 గంటలు పనిచేస్తోందని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా, సోమ్లాతండా, కేసముద్రం మండల కేంద్రంలో స్థానిక ఎంఎల్‌ఎ భూక్యా మురళీనాయక్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ప్రజాపాలనప్రగతిబాట బహిరంగ సభలో ఆయన ము ఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. జూలై 12 నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు, రాజీవ్ యువ వికాసం అమలు చేస్తామన్నారు. ఉచిత సన్న బియ్యం, గ్యాస్ సబ్సిడీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూ ల్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, 56 వేల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, రాజీవ్ యువవికాసం, మహిళలకు ఉచిత బస్సులాంటి అనేక సంక్షేమ పథకాల అమలుతో నిరుపేదల కోసం కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు.అనంతరం మంత్రుల బృందం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. మహిళాసమాఖ్య ప్రతినిధులకు బ్యాంకు లింకేజీ రుణాన్ని అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసముద్రం మండలంలో రూ.223 కోట్ల వ్యయంతో పలు గ్రామాల్లో బిటి రోడ్లు నిర్మాణం, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి చొరవతో కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటైందని, రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సహకారంతో మార్కెట్, గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చొరవతో కేసముద్రం మండలంలో ఏడు దేవాలయాలకు రూ.50 లక్షల చొప్పున నిధులు కేటాయించారని అన్నారు.
త్వరలోనే నారాయణపురం రైతుల సమస్యకు పరిష్కారం
రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా పరిధిలో నారాయణపురం, పంతులు తండా, సీతానాగారం గ్రామాల్లో భూసమస్యలున్న విషయాన్ని ఎంఎల్‌ఎ తన దృష్టికి తీసుకువచ్చారని, త్వరలోనే ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వేదిక నుండి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు.
రూ.5 కోట్లతో జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం
జిల్లా కేంద్రంలో ఐదు కోట్ల రూపాయలతో త్వరలోనే ఇందిరా మహిళాశక్తి భవనాన్ని నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. రాష్ట్రంలోని మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలు మరణిస్తే 10 లక్షల రూపాయల బీమా అందజేస్తున్నామన్నారు. సభలో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్, ఎంపి పొరిక బలరాంనాయక్, ఎంఎల్‌ఎలు కోరం కనకయ్య, కెఆర్ నాగరాజు, బెల్లయ్య నాయక్, రాయల నాగేశ్వర్‌రావు, కేసముద్రం మార్కెట్ ఛైర్మెన్ గంట సంజీవరెడ్డి, కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఖమ్మం ఎస్‌పి సునీల్‌దత్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్‌చంద్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, ఓబిసి ఛైర్మన్ మేకల వీరన్న యాదవ్, కేసముద్రం, ఇనుగుర్తి పార్టీ మండల ్ట అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్‌రావు, కూరెళ్లి సతీష్, మాజీ జెడ్‌పిటిసి బండారు వెంకన్న, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ సభ్యులు రావుల మురళి తదితరులు పాల్గొన్నారు.