Sunday, September 7, 2025

‘కారు’లో తకరారు!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో బిఆర్‌ఎస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పార్టీ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి సస్పెన్షన్, ఆపై ఆమె చేసిన సంచలన ఆరోపణలు, తదుపరి రాజీనామా.. ఇవన్నీ బిఆర్‌ఎస్‌లోని అంతర్గత కలహాలను బట్టబయలు చేశాయి. ఈ వివాదం కేవలం కుటుంబ రాజకీయాలకు పరిమితమా? లేక పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే సమస్యలా? ముందుగా, ఈ ఘటనల నేపథ్యాన్ని చూస్తే, బిఆర్‌ఎస్ పార్టీలో కవిత సస్పెన్షన్‌కు ముందు నుంచి అంతర్గత విభేదాలు ఉన్నాయి. ‘తెలంగాణ జాగృతి’ సంస్థ వ్యవస్థాపకురాలిగా, మాజీ ఎంపిగా కవిత పార్టీలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమె అరెస్ట్ అయి, ఆరునెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత పార్టీలో ఆమె స్థానం ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న బిఆర్‌ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. కారణం.. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ చాలా కాలంగా ఓపిక పట్టి, ఆమె శృతిమించి పార్టీ పై, ఇతర పార్టీ నేతలపై చేసిన ఆరోపణల ప్రభావంతో ఆమెను బిఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఇది కవితకు షాక్‌గా మారింది. దీనితో ఆమె వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి మరికొన్ని సంచలన ఆరోపణలు చేశారు.

కవిత ముఖ్య ఆరోపణలు హరీశ్ రావు, సంతోష్ రావుపైనే ఎక్కువగా సాగాయి. వీరిద్దరూ బిఆర్‌ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి వీరే కారకులు. నా తండ్రి కెసిఆర్‌ను బలి పశువుగా చేస్తున్నారు అని ఆమె అన్నారు. మరో వైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీశ్ రావు కుమ్మక్కై తన సస్పెన్షన్‌కు కారణమయ్యారని ఆరోపించారు. ‘నాన్నా, (కెసిఆర్) రామన్నా (కెటిఆర్) జాగ్రత్త’ అంటూ ఆమె వారిని హెచ్చరించడం విశేషం. ఇంకా, పార్టీని బిజెపిలో విలీనం చేయాలని వీరు ప్రయత్నిస్తున్నారు. నేను జైలులో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి అని ఆమె వెల్లడించారు. ఈ ఆరోపణలు బిఆర్‌ఎస్‌లో మాత్రమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ప్రెస్‌మీట్ తర్వాత కవిత బిఆర్‌ఎస్ పార్టీకి, ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేశారు. నేను వేరే పార్టీలో చేరడం లేదు, కానీ పార్టీలోని కుట్రదారులు నన్ను బయటకు తోసేశారు’ అని అన్నారు.

ఇది బిఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ఎందుకంటే, కవిత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆమె నిజామాబాద్ ఎంపిగా, జాగృతి సంస్థ ద్వారా మహిళలు, బిసిల హక్కుల కోసం పోరాడారు. అలాంటి నేతను పార్టీ నుంచి తొలగించడం పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక, బిఆర్‌ఎస్ పార్టీ స్పందన చూస్తే, కవిత ఆరోపణలను తోసిపుచ్చారు. పార్టీ అధికారికంగా ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని ప్రకటించింది. కెసిఆర్ మాత్రం రిలాక్స్‌గా ఉన్నారని, ఆయన ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. అయితే, పార్టీలోని కొందరు నేతలు కవితకు మద్దతుగా మాట్లాడుతున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో బిఆర్‌ఎస్ కేడర్ విభజితమైంది. కొందరు కవితను ‘పార్టీ ద్రోహి’ అంటుంటే, మరికొందరు ‘ఆమె ఆరోపణల్లో నిజం ఉంది’ అని అంటున్నారు. ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ట్రెండింగ్ అయింది. అక్కడ కవిత మాటలను ఉటంకిస్తూ వీడియోలు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందనలు కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇది మీ కుటుంబ పంచాయతీ, నన్ను ఎందుకు మధ్యలో లాగుతారు?’ అని స్పందించారు. అయితే, కవిత ఆరోపణలు కాళేశ్వరం అవినీతి విషయాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చాయి.

ఈ ప్రాజెక్టు విషయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలున్నాయి. కవిత హరీశ్ రావు ధన దాహం అపారం అని అనడం ద్వారా పార్టీలోని అవినీతిని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌కు ప్రత్యక్షంగా రాజకీయ లబ్ధి చేకూర్చవచ్చు. ఎందుకంటే వారు ఇప్పటికే కాళేశ్వరం విచారణకు సిబిఐకి ఆదేశాలు ఇచ్చారు. విశ్లేషణాత్మకంగా చూస్తే, ఈ వివాదం బిఆర్‌ఎస్‌కు పెద్ద సవాల్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇది పార్టీలో అతిపెద్ద చీలిక. కెసిఆర్ కుటుంబం ఆధిపత్యంలో ఉన్న పార్టీలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పార్టీ కేడర్‌ను డీమోరలైజ్ చేయవచ్చు. కవిత ‘కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదు, కానీ భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు’ అని అనడం ఆసక్తికరం. ఆమె తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, విశ్లేషకులు ‘కవిత సొంత పార్టీ పెట్టినా, కేడర్ వెంట రావడం కష్టం’ అంటున్నారు.

బిఆర్‌ఎస్ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, లోక్‌సభలో ఎన్నికల్లో కూడా బలహీనమైంది. ఈ చీలిక పార్టీని మరింత బలహీనపరుస్తుంది. విమర్శనాత్మకంగా చూస్తే, కవిత ఆరోపణలు ఎంతవరకు నిజమో అన్న ప్రశ్న. ఆమె ‘కాళేశ్వరంలో అవినీతి హరీశ్ రావు చేతి పని’ అని అన్నారు కానీ, ప్రాజెక్టు నిర్మాణం కెసిఆర్ హయాంలోనిది. ఇది పార్టీపైనే బురద జల్లడమా? మరోవైపు, పార్టీలో మహిళా నేతలకు సరైన అవకాశాలు లేకపోవడం కవిత సస్పెన్షన్‌కు కారణమా? సోషల్ మీడియాలో కొందరు ‘కవితను లక్ష్యం చేసుకోవడం గ్రీక్‌వీరుల చర్య’ అని విమర్శిస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ట్విట్టర్ ట్రెండ్‌లు, ప్రెస్‌మీట్ వీడియోలు ఈ వివాదాన్ని మరింత రెచ్చగొట్టాయి. మొత్తంగా, ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ రాజకీయాల ప్రమాదాలను బయటపెడుతోంది. బిఆర్‌ఎస్ ఐక్యత కాపాడుకోకపోతే, కాంగ్రెస్, బిజెపిలకు లాభం చేకూరవచ్చు. కవిత భవిష్యత్ నిర్ణయాలు, పార్టీ పునర్నిర్మాణం… ఇవి రాబోయే రోజుల్లో కీలకం. ఈ వివాదం పార్టీలో సంస్కరణలకు దారి తీస్తుందా? లేక మరిన్ని చీలికలకా? అనేది కాలమే చెప్పాలి.

డా. రామ్‌ప్రసాద్ 98493 28496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News