జూన్ 14, ఈ తేదీ వినగానే ఓ గొప్ప సేవా భావానికి, ఓ మానవత్వానికి నిదర్శనంగా నిలిచే రోజు గుర్తుకు వస్తుంది. అదే అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం. మనుషుల్లో నిజమైన మానవత్వాన్ని, కరుణను, నిస్వార్థతను ప్రతిబింబించే అద్భుతమైన సందర్భం ఇది. ఈ రోజు, మనకు తెలిసిన, తెలియని వేలాది మంది రక్తదాతల సేవలను స్మరించుకునే, గౌరవించుకునే రోజు మాత్రమే కాదు – మరెంతో మందిలో రక్తదానం చేయాలనే స్ఫూర్తిని కలిగించే రోజు కూడా. ఒక్కోసారి మనం చేసే చిన్న సహాయం ఎన్నో లక్షల కుటుంబాలను నిలబెడుతుంది. రక్తదానం అచ్చంగా, స్వచ్ఛంగా అలాంటి సహాయమే. రక్తాన్ని ఇవ్వడం కోసం మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ, మనం ఇచ్చే ప్రతి ఒక్క రక్తపు బొట్టు లక్షల జీవితాలకు ఊపిరిగా నిలుస్తుంది. మన రక్తంలో ఉన్న జీవశక్తి ఇంకొకరికి శ్వాసగా మారుతుంది. రక్తదానం మనిషి చేసే అన్ని దానాల కంటే చాలా గొప్పది. వాస్తవానికి ఇది దానం చేయడం కాదు ప్రాణం పోయడం.
ప్రతి బ్లడ్ బ్యాంక్ (Blood bank) దగ్గర, హాస్పిటల్ దగ్గర పరిస్థితులను గమనించగలిగితే ఈ వాస్తవికత మనకు అర్థమవుతుంది. ప్రతి రెండు నిమిషాలకో వ్యక్తికి భారతదేశంలో రక్తం అవసరం అవుతుందని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. గర్భిణీలు సురక్షితంగా బిడ్డకు జన్మనివ్వాలంటే, రోడ్డు ప్రమాద బాధితులు మరలా తమ జీవితాన్ని, కుటుంబ భవిష్యత్తును చూడాలంటే, క్యాన్సర్, ఇతర తీవ్రవ్యాధులతో పోరాడుతున్న వారిలో ఆశను బతికించాలంటే రక్తదానమే ప్రాణాధారం. ఇలాంటి సందర్భాల్లో రక్తదానం అక్షరాలా ఓ సంజీవినిగా మారుతుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అయితే, ఆందోళన పడవలసిన వాస్తవం ఏమిటంటే, మన దేశంలోని అనేక హాస్పిటళ్లూ, బ్లడ్ బ్యాంకులూ అవసరమైనంత రక్తనిల్వలను కలిగి లేవు. ప్రతి రోజు వేలాది మందికి రక్తం అవసరమవుతున్నా, అందుబాటులోలేక బాధితులు ప్రాణాలను కోల్పోతున్నారు.
ఈ కొరతను అధిగమించగల శక్తి మనందరిలో ఉంది. అందుకే ప్రజలందరిలో ముఖ్యంగా యువతలో, రక్తదానం పట్ల స్పష్టమైన అవగాహన కల్పించాలి. రక్తదానం చేయడాన్ని కేవలం ఓ సేవగానే కాకుండా ఒక బాధ్యతగా కూడా భావించాలి.రక్తదానం చేయడం వలన మనకు శారీరిక, మానసిక ఆరోగ్యాలతో పాటు ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఇది మనల్ని ఎవరు గుర్తించకపోయినా కూడా కలిగే నిజమైన ఆత్మసంతృప్తి. అంతేకాదు, మన మీద మనకి గౌరవం పెరుగుతుంది. ప్రతి రక్తదానంతో శరీరంలోని అదనపు ఐరన్ మోతాదును తగ్గించుకోవచ్చు. ఇది గుండెపోటు వంటి సమస్యల అవకాశాలను తగ్గిస్తుంది. మరిన్ని పరిశోధనల ప్రకారం, రక్తదానం చేసే వారికి గుండె ఆరోగ్య పరిస్థితులు మెరుగుగా ఉంటాయని తేలింది. ఒక జీవితాన్ని కాపాడినప్పుడు కలిగే ఆనందం చాలా అమూల్యమైనది, వెలకట్టలేనిది.
రక్తదానం చేయడం వలన మనలో మానవతా దృక్పథం పెరుగుతుంది. ఈ జీవితం మనకోసమే కాదు ఇతరుల కోసం కూడా అనే సామాజిక భావం మనలో చిగురిస్తుంది. ఈ భావన మనల్ని మరింత బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది. వయస్సు 18 నుండి 65 ఏళ్ళ మధ్యలో ఉండి, ఆరోగ్యంగా ఉండేవారు రక్తదాతలుగా మారవచ్చు. మధుమేహం, బిపి వంటివి ఉన్నవారైనా, వాటిని నియంత్రణలో ఉంచి డాక్టరు సలహా మేరకు రక్తం ఇవ్వవచ్చు. ప్రతి రక్తదాత ఒకరి జీవితాన్ని మార్చడమే కాదు, తమను తాము గొప్పగా చూసుకునే అవకాశం పొందుతారు! ఒక మనిషి మానవతా వాదిగా మారటానికి మొట్టమొదటి అడుగు రక్తదానం.
సామాజిక బాధ్యత గల ప్రతి ఒక్కరూ రక్తదానాం చేసి తమలోని మానవత్వాన్ని చాటుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ రక్తం ఎందుకు ఇవ్వాలని ఆలోచించడం మాని, ఎప్పుడు ఇవ్వాలని ఆలోచించాలి. మనిషి తన మేధస్సును అనుకరించగల కృత్రిమ మేధస్సును సృష్టించాడు గాని కృత్రిమ రక్తాన్ని సృష్టించలేకపోయాడు. మనం ఒక్కసారి రక్తం ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి మీద ఆధారపడి బతుకుతున్న ఓ కుటుంబాన్ని బతికించగలం. ఈ అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ రక్తాన్ని దానం చేయాలనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని తమ మానవత్వాన్ని చాటుకోవాలి. మనిషికి ఉన్నది ఒకే ఒక్క జీవితమైనా, దానికి ఇంకొకరికి జీవితం ఇవ్వగల శక్తి ఉంది.
- ననుబోలు రాజశేఖర్, 98857 39808
- (నేడు అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం)