హైదరాబాద్: సృష్టిలో రెండు మూడు సార్లు సరోగసి చేసిన వారు ఓ నెట్ వర్క్ లా ఏర్పడ్డారని నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ (Rashmi Perumal) తెలిపారు. నిందితులకు పలువురు వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. ఆమె సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ.. సృష్టి ఫెర్టిలిటి సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని, ఆడ శిశువుకు రూ. 3.50 లక్షలు, మగశిశువుకు రూ. 4.50 గా ధరలు నిర్ణయించారని తెలియజేశారు. కొందరు ధనవంతులైన తల్లిదండ్రుల వద్ద రూ. 30- 40 లక్షల వరకూ వసూలు చేసినట్టు తెలుస్తోందని, ఈ దందాలో చాలామంది ఏజెంట్లు కీలక పాత్ర పోషించారని డిసిపి రష్మీ మండిపడ్డారు.
ఎపి, తెలంగాణలోని అనేక నగరాలు, పట్టణాల్లో ఈ దందా సాగించినట్టు సమాచారం వస్తోందని అన్నారు. వాణిజ్య పరంగా సరోగసి చేయడాన్ని కేంద్రం (Center Surrogacy) ఇప్పటికే నిషేధించిందని పేర్కొన్నారు. సరోగసి విషయంలో ఇలాంటి దందాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అరెస్టయిన వారిలో ఇద్దరు ఎపిలోని కెజిహెచ్ కు చెందిన వైద్యులు ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకూ 26 మందిని అరెస్టు చేశామని, కొందరు పరారీలో ఉన్నారని డిసిపి రష్మీ పెరుమాళ్ స్పష్టం చేశారు.