హైదరాబాద్‌లో పెట్టుబడి మోసాలు నానాటికి తీవ్రమవుతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. నిజాయితీగా డబ్బు సంపాదించాలంటే కష్టం కానీ, మోసం చేసి సంపాదించాలంటే అత్యంత ఈజీ. అదే ఫార్ములాతో ఓ కిలాడీ లేడీ భర్త శ్రీధర్, తమ్ముడు ఎమర్తి రామదాస్ సహకారంతో ఏకంగా బడా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని వందల కోట్లు కొల్లగొట్టింది. చిట్ట చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కింది. ఏకంగా 40 వరకు షెల్ కంపెనీలు, 1800 మ్యూల్ ఖాతాల ద్వారా ఏకంగా రూ. 500 కోట్లు కొల్లగొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. మరో ఘటనలో స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాదారులుగా నటిస్తూ మోసగాళ్ళు 49 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రూ.3.3 కోట్ల రూపాయలకు మోసం చేశారు. ‘జూలై చివరలో ఒక తెలియని వినియోగదారుడు తనను ‘విఐపి -263’ అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చారు.
ఆన్‌లైన్ డాష్‌బోర్డ్‌లో 6.62% లాభాన్ని చూపించి, అధిక రాబడి కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టమని నాకు సలహా ఇచ్చి మరీ రూ.3.3 కోట్ల రూపాయలు లూటీ చేశార’ని సదరు బాధిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తెలిపాడు. మరో కేసుకు సంబంధించి…రాంపల్లి, పరిసర ప్రాంతాలలో ఓపెన్ ప్లాట్‌లను విక్రయించడానికి నకిలీ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఠాలోని ఎనిమిది మంది సభ్యులను కీసర పోలీసులతో పాటు భోంగీర్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఇటీవల అరెస్టు చేసింది. ఓపెన్ ప్లాట్‌లను విక్రయించడానికి నకిలీ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఠాలోని ఎనిమిది మంది సభ్యులను కీసర పోలీసులతో పాటు భోంగీర్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అరెస్టు చేసింది. ఈ ముఠా ఖాళీ భూములను గుర్తించి, మోసపూరిత అమ్మకాలు చేయడానికి నకిలీ యాజమాన్య పత్రాలను తయారు చేసింది, లక్ష్యంగా చేసుకున్న ఆస్తుల మొత్తం విలువ రూ. 5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
ఇక రూ.17 కోట్ల పెట్టుబడి మోసం కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై నగర ఆర్థిక నేరాల విభాగం ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళతో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో మొత్తం 233 మంది పెట్టుబడిదారులు రూ.54 కోట్లు నష్టపోయారని ఫిర్యాదుదారులు పోలీసులకు వెల్లడించారు. రూ.850 కోట్ల పెట్టుబడి మోసం కేసులో నిందితులను గతంలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తొందరపడి మోసగాళ్ల ఉచ్చులో పడిపోవద్దని, అన్నీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అనుమానం కలిగిన వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.