చెన్నై: IPL 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన డూ-ఆర్-డై మ్యాచ్‌లో హైదరాబాద్ గెలుపొంది ప్లేఆఫ్ రేసులో సజీవంగా నిలిచింది. అయితే, ఇప్పటివరకు చెన్నైలో సన్ రైజర్స్ జట్టు ఒక్కసారి కూడా గెలవలేదు. నిన్న జరిగిన మ్యాచ్ లో తొలిసారి చెన్నై గడ్డపై ఆ జట్టును ఓడించింది. దీంతో మొత్తం తొమ్మిది మ్యాచ్ లు ఆడిన ఎస్ఆర్ హెచ్.. మూడు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. అయినా ఈ విజయంతో హైదరాబాద్ జట్టు.. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
కాగా, మ్యాచ్ విషయానికి వస్తే..టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి మరో ఓపెనర్ హెడ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. హెడ్ 4 ఫోర్లతో 19 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ 5 ఫోర్లు, సిక్స్‌తో 44 పరుగులు సాధించాడు. అనికేత్ వర్మ (19), కమిందు మెండిస్ 32 (నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి 19 (నాటౌట్)లు జట్టును గెలిపించారు.