ఇజ్రాయెల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున వైమానిక దాడులలో 60 మంది వరకూ మృతి చెందారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతులలో కనీసం 20 మంది వరకూ పిల్లలు ఉన్నారు. మహిళలు, వృద్ధులు కూడా బలి అయ్యారని స్థానిక ఆసుపత్రుల అధికారులు , ఆరోగ్య శాఖ వేర్వేరుగా వెలువరించిన ప్రకటనలలో తెలిపారు. గాజాసిటి దక్షణ ప్రాంతంలోని ఖాన్ యూనస్ మరోసారి ఇజ్రాయెల్ సైనిక ఆగ్రహానికి గురైంది.
తెల్లవారుతూనే వచ్చిపడ్డ వైమానిక దాడులతో స్థానిక పౌరులు తల్లడిల్లారు. అనేక చోట్ల భయానక పరిస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లుతున్న దశలో ఇజ్రాయెలీ అమెరికా జాతీయుడు ఒక్కడిని హమాస్ బంధ విముక్తిడిని చేసింది. అమెరికా చొరవతో కుదిరిన సయోధ్యలో భాగంగా బందీ విడుదల జరిగింది. అయితే గంటల వ్యవధిలోనే గాజాస్ట్రిప్‌పై మరింత శక్తివంతంగా ఇజ్రాయెల్ వైమానిక దాడి జరగడంతో ఇరు పక్షాల మధ్య శాంతి యత్నాలకు గండి ఏర్పడింది.