గాజాలో ఇజ్రాయెల్ దారుణ మారణహోమానికి అగ్రనాయకులే ఆజ్యం పోస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి కమిషన్ మంగళవారం వెలువరించిన 72 పేజీల నివేదికలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. పాలస్తీనా ప్రజలకు నిలువనీడ లేకుండా చేయడమేకాక సామూహిక హత్యాకాండకు పాల్పడుతోందని నివేదిక స్పష్టం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1948లో ఐక్యరాజ్యసమితి జర్మనీలో హిట్లర్ ఊచకోతలను ప్రామాణికంగా తీసుకొని ‘సామూహిక హత్యాకాండ’ అంటే ఏమిటో నిర్వచించింది. దీనినే జీనోసైడ్ కన్వెన్షన్ (జాతి నిర్మూలన నివారణ సదస్సు)అని పిలుస్తారు. ఈ కన్వెన్షన్‌లో సూచించిన నిబంధనలు ప్రకారం సామూహిక మారణ కాండను తీవ్ర నేరంగా పరిగణిస్తారు. నాజీ జర్మనీలో హిట్లర్ 60 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్‌లో పెట్టి ఊచకోత కోసిన మారణకాండ చరిత్రలో మరువరాని తీవ్ర విషాద ఘట్టం.
అదే విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 1948 జీనోసైడ్ కన్వెన్షన్‌లోని అయిదు మారణకాండ చర్యల్లో నాలుగింటికి పాల్పడిందని ఐరాస కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదిక హమాస్ తయారు చేసిన అబద్ధాల పుట్టగా ఇజ్రాయెల్ కొట్టిపారేయడం మామూలే. కొన్ని వేల బతుకుల చితిమంటలతో ఓవైపు ఇజ్రాయెల్, మరోవైపు పరోక్షంగా అమెరికా చలి కాచుకుంటున్నాయి. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ట్రంప్ కనుసన్నల్లో మసలే అత్యంత సన్నిహితుడే. ట్రంప్ గట్టిగా తలంచుకుంటే ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపించగలరు. కానీ అలా ప్రయత్నించకుండా కొనసాగింప చేయడమే ట్రంప్ వ్యూహం. కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ ప్రతిపాదన ప్రకారం ఇటీవల దోహా లో ఖతార్ అధికారులు, హమాస్ నేతలు చర్చలు సాగించారు.
ఈ చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందంటే ట్రంప్ ప్రతిపాదన బేఖాతరు చేసినట్టే. ఖతార్ తనకు ముఖ్యమైన మిత్రదేశమని దానిపై దుందుడుకుగా వ్యవహరించవద్దని ట్రంప్ హెచ్చరించడం కేవలం కంటితుడుపే. ఖతార్‌పై ఇజ్రాయెల్ గతవారం మెరుపుదాడులు చేసి హమాస్ ముఖ్య నేతలను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడుల సంగతి ఖతార్‌కు తెలియకుండా అశ్వత్థామ హతః కుంజరః అన్నట్టు అమెరికా వ్యవహరించడం ఎవరికి తెలియనిది కాదు. తాము ముందుగానే సమాచారం ఖతార్‌కు అందించామని ట్రంప్ సన్నాయి నొక్కులు నొక్కడంలో చెప్పలేదనే సంగతి బయటపడింది. ఇజ్రాయెల్ దాడిపై ఆగ్రహంతో ఉన్న ఖతార్ పాలక వర్గాలను ఓదార్చడానికి ఇజ్రాయెల్ నుంచే అమెరికా రక్షణ మంత్రి మార్కొరూబియో వెళ్తుండడం, అంతకు ముందు ఇజ్రాయెల్ నెతన్యాహుతో తానతందాన అంటూ హమాస్‌ను పూర్తిగా నిర్మూలించాల్సిందేనంటూ వంతపాడడం దేనికి సంకేతం ? హమాస్ చెరలో బందీలుగా ఉన్న మిగతా 48 మందిని విడిపించుకోడానికి హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్షమని ఇజ్రాయెల్ బాహాటంగా ప్రకటిస్తోంది.
ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించి వైదొలిగితే కాని తాము బందీలను విడిచిపెట్టేది లేదని హమాస్ కరాఖండీగా చెబుతోంది. కొండలు కొండలు ఢీకొని గొర్రె పిల్లలు చనిపోయినట్టు ఇరువర్గాల భీషణ ప్రతిజ్ఞలకు అభమూ శుభమూ తెలియని కొన్ని వేల మంది సామాన్య పౌరులు రాలిపోతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మహిళలు, చిన్నారులే. పాలస్తీనా ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం 2023 అక్టోబర్ 7 నుంచి 65 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హమాస్‌కు చెందిన వారు ఎంతమంది ఉన్నారో తెలీదు. అక్టోబర్ 7 దాడులకు ముందునుంచే ఇజ్రాయెల్ పాలస్తీనాలోకి సరకులు అనుమతించకుండా అడ్డుకుంటోందని, హమాస్ దాడి తర్వాత జీవనాధార అవసరాలను కూడా నిలిపివేయడంతో గాజావాసుల జీవనం దుర్భరంగా మారిందని నివేదిక వెల్లడించింది.
హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడులు చేయడంతో గాజాలో యుద్ధం మొదలైంది. దాదాపు 1200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 251 మంది హమాస్ బందీలయ్యారు. ఖతార్ తదితర వర్గాల మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ సమయంలో చాలా మంది బందీలు విడుదలయ్యారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో 64,871 మంది పాలస్తీనియన్లు బలైపోయారు. మృతుల్లో సగానికి సగం మంది మహిళలు, చిన్నారులే అని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మంగళవారం ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడైన తరుణంలోనే మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ బలగాలు నేరుగా భూతల దాడులకు దిగడంతో వేలాది మంది ప్రాణభయంతో పాలస్తీనాను విడిచిపెట్టి పారిపోతున్నారు. గాజాలో తాజాగా జరిగిన దాడుల్లో 34 మంది మృతి చెందారు.
గాజా సిటీలో దాదాపు మూడు వేల మంది హమాస్ ఉగ్రవాదులు ఉన్నారన్న అంచనాతో ప్రతి అంగుళం గాలిస్తున్నారు. ఇజ్రాయెల్ ఆపరేషన్‌కు ముందు గాజాలో దాదాపు 10 లక్షల మంది పాలస్తీనా వాసులు ఉండేవారు. ఇప్పటివరకు 3.5 లక్షల మంది నగరం విడిచి వెళ్లిపోయారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం గత నెలలో 2.20 లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి తరలి వెళ్లినట్టు తేలింది. ఇదిలా ఉండగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80 వ వార్షికోత్సవ వేడుకల రెండో విడత ఉన్నత స్థాయి సమావేశాలు ఈనెల 23 నుంచి న్యూయార్క్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా యూరప్ దేశాలు పాలస్తీనాను ఒక సర్వ స్వతంత్ర, సార్వభౌమాధికార దేశంగా గుర్తించనుండటం పాలస్తీనా ప్రజల అస్తిత్వానికి రక్షణ కల్పించడమే.
Also Read : ఇది నవభారతం.. ఎవరికీ భయపడం