డియిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ సేనలు ఆదివారం మరోసారి గాజాలోని రెండు అన్నార్థుల సహాయక కేంద్రాల వద్ద దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది వరకూ మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గాజాలో ఇజ్రాయెల్ సహకారంతోనే ఆజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (.జిహెచ్‌ఎఫ్) అన్నార్థులకు తిండి, మందులు మంచినీళ్ల పంపిణి చేపడుతోంది. పలు ఆసుపత్రులలో, ఈ శిబిరాల వద్ద ఇజ్రాయెల్ దాడుల క్రమంలో సరుకులు మందులు అందక వందలాది మంది చనిపోతున్నారని వార్తలు వెలువడ్డాయి. దీనితో గాజాలోని కొన్ని నిర్ణీత ప్రాంతాలలో ఇజ్రాయెల్ గత కొద్దిరోజులుగా దాడులను రోజుకు కొన్ని గంటల పాటు విరమించింది.
అయితే ఇప్పుడు ఆదివారం రెండు చోట్ల దాడులను ఉధృతం చేసింది. సహాయక కేంద్రాల వద్ద దాడుల్లో పది మందికిపైగా మృతి చెందారు. మృతులు ఎక్కువగా పౌరులే అని వెల్లడైంది. కాగా గాజాలో కిక్కిరిసి జన సంచారం ఉండే జికిమ్ చౌరస్తా వద్ద ఇజ్రాయెల్ సేనల దాడిలో 20 మంది వరకూ చనిపోయారు. తిండి, మందులు మంచినీటి కోసం ఇక్కడికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చిన దశలోనే కాల్పులు జరిగినట్లు వెల్లడైంది. జిహెచ్‌ఎఫ్ కేంద్రాలకు అమెరికా నుంచి కూడా భారీ స్థాయిలో నిధులు అందుతున్నాయి. ఈ కేంద్రాల వద్దకు అసంఖ్యాకంగా జనం తరలివస్తున్నారు. వీరిని అదుపులో పెట్టడం ఇక్కడి నిర్వాహకులకు వీలు కాని పని అయింది. ఈ దశలో శరణార్థులు, అన్నార్థులు వీధుల్లోకి తరలివెళ్లడం, ఈ దశలోనే ఇజ్రాయెల్ దాడులు జరగడం సాధారణ ప్రక్రియ అయినా రక్తపాతానికి దారితీస్తోంది.