Monday, May 12, 2025

మే 18న ఇస్రో ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌తో ఇటీవల తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశ సరిహద్దుల్లో నిఘా, జాతీయ భద్రతను పెంచేందుకు భారత్ కొత్త ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) పిఎస్‌ఎల్‌వి సి61మిషన్ ద్వారా ఇఒఎస్09 (రిసాట్ 1బి) రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని అంతరిక్షం లోకి ప్రవేశ పెట్టనుంది. అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన ఈ శాటిలైట్‌ను మే 18న తెల్లవారు జాము 5.59 గంటలకు శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాన్ని ఎర్త్ అబ్జరేషన్ శాటిలైట్ (ఇవొఎస్09)గా పిలుస్తారు. ఈ ఉపగ్రహం అత్యాధునిక సిబ్యాండ్ ఎస్‌ఎఆర్ వ్యవస్థతో అమర్చబడి ఉంది. దేశ సరిహద్దులో రాత్రింబవళ్లు శత్రువుల కదలికలను ఓ కంట కనిపెడుతూ నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. చొరబాట్లను గుర్తించి, ఉగ్రవాద నిరోధక చర్యలకు సహాయపడుతుంది.

దేశ రక్షణ రంగానికి ఈ ప్రయోగం కీలక అడుగుగా భావిస్తున్నారు. వ్యవసాయం నుంచి అడవులు, నేల తేమ పర్యవేక్షణ, భూగర్భశాస్త్రం, వరద ప్రమాద హెచ్చరికల వరకు 24 గంటలూ పనిచేస్తూ చిత్రాలను అందిస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 1710 కిలోల బరువు ఉంటుంది. అంతరిక్ష విభాగం ఆహ్వానం మేరకు ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి దాదాపు 24 మంది ఎంపీలు వస్తున్నారు. ప్రయోగం తరువాత సాయంత్రం వీరంతా తిరుపతికి వెళ్తారు. అక్కడ ముఖ్యమైన సెన్సు అండ్ టెక్నాలజీ సంస్థను సందర్శిస్తారు. బాలకోట్ స్ట్రైక్ వంటి కార్యకలాపాల్లో ఉపయోగించే ప్రస్తుత రీసాట్ సిరీస్ ఉపగ్రహాల అధునాత వెర్షన్ రిసాట్ 1బి . ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో రిసాట్ 1 బి కీలక పాత్ర పోషిస్తుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కొద్ది రోజులకే ఈ ప్రయోగం జరుగుతుండడం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News