చెన్నై: ప్రముఖ తమిళ నటుడు ఆర్యకు (Hero Arya) ఐటి శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన నివాసంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం చెన్నైలోని అన్నానగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ‘‘సీ షెల్’’ రెస్టారెంట్లపై సోదాలు చేపట్టారు. గతంలో ఈ రెస్టారెంట్ చైన్‌తో సంబంధం ఉండటంతో ఆర్య నివాసంలోనూ తనిఖీలు జరిపారు.
ఈరోజు ఉదయం ఐటి అధికారులు సీ షెల్ రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖలకు చేరుకున్నారు. అన్నానగర్‌లోని బ్రాంచ్‌లో ఉదయం 8 గంటలకు పోలీసుల బందోబస్తు నడుమ సోదాలు ప్రారంభించారు. అదే సమయంలో పూనమల్లి హై రోడ్‌లో ఉన్న ఆర్య నివాసంలో మరో ఐటి బృందం సోదాలు చేపట్టింది. గతంలో ఆర్య (Hero Arya) ఈ రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించారు. కానీ ఆ తర్వాత ఈ రెస్టారెంట్లను కేరళకు చెందిన కున్హిమూసా అనే వ్యాపారవేత్తకు విక్రయించినట్లు సమాచారం. దీంతో సీ షెల్ రెస్టారెంట్లతో తనకు సంబంధం లేదని ఆర్య స్థానిక మీడియాతో చెప్పారు.