Wednesday, May 28, 2025

 గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. వచ్చే నెల జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ కొండాపూర్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ సన్నాహాలు పూర్తిచేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు దాదాపు తీరనున్నాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న ఐటి కారిడార్ ఉద్యోగులకు కొంత ఉపశమనం కలుగనున్నది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నుండి కొండాపూర్‌కు సులభంగా, సౌలభ్యంగా వాహనాలు రాకపోకలు ఈ ఫ్లైఓవర్ మీదుగా సాగించనున్నాయి. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వస్తే ప్రధానంగా గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. వాహనాల ప్రయాణ సమయం తగ్గి వేగంగా గమ్యస్థానాలకు ఉద్యోగులు చేరుకోనున్నారు.

రూ. 178 కోట్ల వ్యయంతో..
ఈ ఫ్లైఓవర్‌ను రూ.178 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డిపి) పథకంలో భాగంగా నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు. ఆరు లేన్లతో ఇది ఏర్పాటుచేశారు. ఇది ఇప్పటికే ఉన్న ఇతర రెండు ఫ్లైఓవర్లపై నుంచి నిర్మించిన మూడవ స్థాయి ఫ్లైఓవర్ కావడం విశేషం. దీని క్రింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపైన శిల్పా లేఅవుట్ ఫేజ్1 ఫ్లైఓవర్ ఉండగా, ఈ ఫ్లైఓవర్ పై మీదుగా శిల్పాలేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించారు.గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన వాహనాల రద్దీ ఏర్పడుతోంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వస్తే ఈ వాహనాల రద్దీ పూర్తిగా తగ్గి ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానున్నది.

ఓఆర్‌ఆర్ నుండి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనాలకు ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లను కలుపుతూ వాహనాలకు రోడ్ల మధ్య మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.ప్రయాణ సమయం ఆదాతో పాటు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వేగంగా నేరుగా తమతమ గమ్యస్థానాలకు వాహనదారులు చేరుకునే వీలుంటుంది. కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అక్కడి నుండి కొండాపూర్ ప్రాంతాలకు వెళ్ళేందుకు గచ్చిబౌలివద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు కలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News