Friday, May 2, 2025

ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెసే విలన్:జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీనే విలన్ అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల పై మాజీ మంత్రి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ గురించి కామెంట్ చేసేటోళ్లకు బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఓ చెంపపెట్టు అని, కేసీఆర్ నోట రేవంత్ మాట రాలేదనే అక్కసులో ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న బ్రమలో ఉన్నాడని, రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగత ప్రచారమే ఎక్కువని, పోరాడి సాధింకుకున్న తెలంగాణ పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. ఆనాడు తెలంగాణ ఇచ్చింది ప్రేమతో కాదని, భయంతో అని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారని, ఒక్క మంచి పని చేయని రేవంత్ పేరు ప్రజలెందుకు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. రేవంత్ వల్ల బాధించబడ్డ వారే ఆయనను ఓడించేందుకు గుర్తు పెట్టుకుంటారని, ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

ఉద్యమ సమయంలో 359 మందిని కాల్చిన పాపం కాంద్రెస్ ది అని, కేసీఆర్ దీక్ష సమయంలో విద్యార్ధుల బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాదా అని ప్రశ్నించారు. అందుకు ముమ్మాటికి తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరునుంచి ఎన్ని కార్లలో ఎంతెంత ధాన్యం కొనుగోలు చేశారో వివరాలు చెప్పే ప్రయత్నం లేదని, రైతులకు ఎంత మేరకు బోనస్ చెల్లించారో వివరాలే లేవని ఎద్దేవా చేశారు. ఎన్‌డిఎస్‌ఏ ను పట్టుకుని మూడు సార్లు నివేదికంటూ మాట్లాడుతున్నారని ఎన్‌డిఎస్‌ఏ నివేదిక కాదని ఎన్‌డిఏ రిపోర్ట్ అని అన్నారు. కేసీఆర్ సభకు వచ్చిన ప్రజలను గమనిస్తే ఈ మధ్య కాలంలో హైటెక్ సిటీలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ జరిగిన ప్రాంతం ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరం, మేడిగ్డను తమకు అప్పగిస్తే మూడు రోజులలో అన్ని ప్రాంతాలకు సాగు నీటిని అందజేస్తామని సవాల్ చేశారు. రేవంత్‌నుకు గుర్తు పెట్టుకుంది లఘుచర్ల బాధితులు, మూసి పరివాహక ప్రాంత నిర్వాసితులు, హైడ్రా బాధితులు, గురుకుల విద్యార్ధుల తల్లిదండ్రులు గుర్తు పెట్టుకుంటారు కానీ ప్రజలు ఎవరు గుర్తు పెట్టుకోరని వివరించారు.

ఎల్కతుర్తి బిఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటలను ప్రజలంతా స్వాగతించారని, పదవి రాగానే సోనియాని బలి దేవతన్న మాటలు మరిచిపోయావా అని ప్రశ్నించారు. తెలంగాణలో పదవులు అనుభవిస్తూ ఆంధ్రాకు వత్తాసు పాలకడం సిగ్గుచేటని, తెలంగాణ ద్రోహుల కొమ్ముకాసేటోళ్లకు మన అభివృద్ధి పడుతుందనుకోవడం కూడా బ్రమే అని, అధికారం కోసం దిగజారే నైజం రేవంత్ రెడ్డిది అన్నారు. పదేండ్లు మాదే అధికారమన్న వాళ్లకి కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉంటే భయమెందుకు అని, ఎన్ని రోజులు పదవిలో ఉంటాడో గ్యారెంటీ లేని సీఎం రేవంత్ అని అన్నారు. దమ్ములేక చేతగాక తప్పుడు మాటలతో విమర్శలు చేయడం మానుకొని ప్రజల కోసం పని చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా మాజీ గ్రంధాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News