Sunday, July 27, 2025

బిజెపితో బిఆర్‌ఎస్ పొత్తు ఉండదు: జగదీష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిజెపిలో బిఆర్‌ఎస్ విలీనం అవుతుందని సిఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణం పోయినా సరే బిజెపితో బిఆర్‌ఎస్ పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే బిజెపితో పొత్తు అని వార్తలు వచ్చాయని.. అప్పుడే ప్రాణం పోయినా సరే బిజెపితో పొత్తు ఉండదని కెసిఆర్ చెప్పారని తెలిపారు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నామని పేర్కొన్నారు. సిఎం రమేశ్ లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు పట్టించుకోవద్దని సూచించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బిజెపి తెలంగాణకు పనికివచ్చే పార్టీ కాదని.. బిఆర్‌ఎస్ భావజాలం వేరు.. బిజెపి భావజాలం వేరు అని కెసిఆర్ చెప్పారని జగదీష్ రెడ్డి తెలిపారు. చిన్న, పెద్ద బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దని.. చంద్రబాబు నాయుడు అలాంటి వారికే పదవులు ఇచ్చారని అన్నారు.

సిఎం రమేశ్ ఇంటికి తాను కూడా మిత్రునిగా వెళ్లానని, ఆయన ఇంటికి కెటిఆర్ లేదా తాను వెళ్తే తప్పు ఏంటి అని ప్రశ్నించారు. సిఎం రమేశ్ ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉంటున్నాడని అన్నారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని 23వ బంగ్లాలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే సిఎం రమేశ్ ఉంటున్నారని, ఆ సిసిటివి ఫుటేజి తీద్దామా..? అని నిలదీశారు. సిసిటివి ఫుటేజీలు తీయాలంటే సిఎం రమేశ్ తన జీవితకాలంలో ఎక్కువగా చంద్రబాబు నాయుడు, సిఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటారన్నారు. తమను భయపెడితేనే బిజెపిలోకి వెళ్లామని సిఎం రమేశ్ తనతో చెప్పారని పేర్కొన్నారు. తాను బిజెపిలోకి వెళ్లినా తాము ఎప్పటికీ చంద్రబాబు మనుషులమే అని ఆయన చెప్పారని అన్నారు. కవిత జైలుకు వెళ్తే బెయిల్ ఇచ్చేది కోర్టు అని, ఆమె విషయంలో పార్టీని బిజెపిలో విలీనం చేస్తామని కెటిఆర్ ఎలా అంటారని ప్రశ్నించారు.

కంచె గచ్చిబౌలి భూముల విషయంలో బిజెపి ఎంపి మధ్యవర్తిత్వం వహించారని కెటిఆర్ ముందే చెప్పారని, పథకం ప్రకారం బిజెపి, చంద్రబాబు, రేవంత్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కులం ప్రస్తావన తెలంగాణ రాజకీయాల్లో ఉందా..? అని ప్రశ్నించారు. ఎపిలో కులం గురించే మాట్లాడతారని, ఆ కులగజ్జి రేవంత్ రెడ్డికి అంటుకుందని అన్నారు. రుత్విక్ కంపెనీ తనది కాదు అన్న సిఎం రమేశ్.. ఆ మాటలకు కట్టుబడి ఉంటారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టునే సిఎం రమేశ్ చదివారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News