రాష్ట్రంలో గత 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, కానీ అవినీతిలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ .. రేవంత్ పాలన తీరు, తమ పార్టీ అగ్ర నేత కెటిఆర్‌కు నోటీసులు, సిరిసిల్లలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ మూకల దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క శాఖ అవినీతిమయమైందని, కమీషన్లు అనేది చాలా సాధారణమైన అంశంగా ప్రజలు చర్చించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏ మంత్రి ఎంత సంపాదించాలే, సిఎం సీటుకు ఎట్లా పోటీపడాలే అన్న సోయి తప్ప మరొకటి లేదన్నారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్న సోయి లేకుండా దోచుకునే విషయంలో అంతా పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తున్న వాళ్లకు నోటీసులు ఇప్పించి భయపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం నిర్లక్షవైఖరి అవలంభిస్తోందని, గత 45 రోజులుగా రైతులు ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి వడ్లు వర్షానికి తడిసి మొలకలెత్తుతున్నాయని,
కొత్తగా నార్లు పోసుకోవలసిన సమయంలో ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మకానికి పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి. మంత్రుల అవినీతి బహిరంగంగా దొరికిపోయే పరిస్థితి ఉందని, ఈడిలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కోసమే ప్రధాని మోడీ దగ్గరికి వెళ్లారని అన్నారు. కాంగ్రెస్ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్‌లకు వెళ్లవద్దని, ముఖ్యమంత్రి గత అసెంబ్లీలో కూడా నీతి ఆయోగ్ మీటింగ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారని, కానీ ఇప్పుడు కేసులను మాఫీ చేసుకోవడానికి మాత్రమే అధిష్టానికి చెప్పకుండా వెళ్లారని వ్యాఖ్యానించారు. అందాల పోటీలతో ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసారని, ప్రజలను దృష్టి మళ్లించడానికి తమ పార్టీ అగ్ర నేత కెటిఆర్‌కు నోటీసులు ఇచ్చారని అన్నారు. ఆనాడు కెటిఆర్ 8 గంటలు కూర్చుని స్వయంగా చెప్పిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. కెటిఆర్ ఇతర దేశాల ఆహ్వానం మేరకు వెళ్తున్నారని, వాటికి హాజరు కాకుండా ఆపాలనే అక్కసుతోనే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్ లవకుశ, మాజీ జడ్‌పిటిసి జీడి భిక్షం, అనిల్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.