అమరావతి: ఎపి సిఎం చంద్ర బాబు నాయుడుకు కొమ్ము కాస్తూ ఎల్లో మీడియా మరింత దిగజారిపోయిందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. బంగారుపాళ్యానికి వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చారని అన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ తీరుపై రైతుల్లో ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసిందని, రైతులను అసాంఘిక శక్తులుగా చిత్రీకరించడం తమకే చెల్లిందని విమర్శించారు. వ్యవసాయం, రైతుల పట్ల తప్పుడు రాతలు రాయిస్తారా? అని నిలదీశారు. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా రాశారని, ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. పాలకుడని చెప్పుకోవడానికి, పత్రికలు అని చెప్పుకోవడానికి తమ ఎల్లో మీడియాకు సిగ్గుండాలని ఎద్దేవా చేశారు.
పండిన పంటను కొనేవాడు లేక రైతులు పారబోస్తున్నారని, ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమేనని చెప్పారు. 2.2 లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట.. 76 వేల రైతు కుటుంబాల సమస్య ఇది అని రైతులు తమ కంటికి దొంగలు, రౌడీలు మాదిరిగా కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు. రైతులు కష్టాల్లో లేకుంటే మామిడికి రూ. 4 ఎందుకు ప్రకటించారని, మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? అని జగన్ ధ్వజమెత్తారు. తమ హయాంలో కిలో మామిడిని రూ. 25-29 కి కొనుగోలు చేశారని, మేలో తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను ఆలస్యంగా ఎందుకు తెరిచారని అన్నారు. తమ వాళ్లకు మేలు చేసే ఉద్దేశంతోనే ఇదంతా చేశారా? అని తమర్ని నిలదీస్తే తప్పుడు రాతలు రాయిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ కనీస మద్దతు ధర లేదని, తమ హయాంలో రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరకరణ నిధి పెట్టి..రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు.
రైతులు నష్టపోతున్నా తమరెందుకు ఆ పని చేయడం లేదు? అని ఏ పంటకు ఏ ధర ఉందనే సిఎమ్ యాప్ ఏమైందీ? అని ప్రశ్నించారు. గతేడాది తమరు ఇస్తానన్న రైతు భరోసా రూ. 20 వేలు ఇవ్వలేదని, ఈ ఏడాది కూడా దాని గురించిన ప్రస్తావన లేదని తమ హయాంలో మే చివరికల్లా పెట్టుబడి సాయం ఇచ్చేవాళ్లమని, ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సీడీని అటకెక్కించారని చురకలంటించారు. ఇ- క్రాప్ విధానాన్ని, ఆర్ బికెలను నిర్వీర్యం చేశారని, టెస్టింగ్ ల్యాబ్ లను సైతం నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారని, ప్రశ్నించిన తమపైన, రైతులపైన అవాకులు, చవాకులు పేలుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబూ అని జగన్ హెచ్చరించారు.