Friday, July 25, 2025

ధన్‌ఖడ్ సంచలన నిష్క్రమణ

- Advertisement -
- Advertisement -

ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్‌ఖడ్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాలనే కాక సామాన్య ప్రజలను సైతం ఆశ్చర్యపరచింది. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన తన పదవికి రాజీనామా ఎందుకు చేశారనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించినప్పటికీ అంతకు మించిన బలమైన కారణమే ఉండి ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. జరిగిన పరిణామాలు సైతం ఆ ఆరోపణలను బలపరిచే విధంగా ఉండడం గమనార్హం. రాజీనామా ప్రకటన చేయడానికి కొద్దిగంటల ముందు కూడా ఆయన రాజ్యసభ చైర్మన్‌గా సభా కార్యకలాపాలను నిర్వహించారు.

అంతేకాదు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆయన మాటల్లో కానీ, చేతల్లో కానీ ఎక్కడా రాజీనామా చేస్తారన్న సంకేతాలు కనిపించలేదు. మధ్యాహ్నం 12.30 గంటలకు తొలుత బిఎసి సమావేశం జరగ్గా ఆ సమావేశానికి రాజ్యసభలో సభా నాయకుడు జెపి నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు సహా సభ్యులందరూ హాజరయ్యారు. మళ్లీ సాయంత్రం 4 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే సాయంత్రం జరిగిన సమావేశానికి నడ్డా కానీ, రిజిజు కానీ హాజరు కాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధన్‌ఖడ్ సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆరోగ్య కారణాల దృష్టా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖడ్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఉంచిన పోస్టులో పేర్కొన్నారు.

ధన్‌ఖడ్ ప్రకటన రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత హఠాత్తుగా రాజీనామాకు ఆయన నిర్ణయం తీసుకోవడం వెనుక అంతకన్నా బలమైన కారణాలు ఏమయినా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం కావడం మొదలైంది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన ట్వీట్ కూడా దీనికి బలం చేకూరుస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంటనుంచి సాయంత్రం నాలుగున్నర మధ్య మూడున్నర గంటల సమయంలో తెరవెనుక అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఫలితంగానే నడ్డా, రిజిజులు బిఎసి సమావేశానికి ఉద్దేశపూర్వకంగానే రాలేదని, ముక్కుసూటి మనిషయిన ధన్‌ఖడ్ దీన్ని అవమానంగా భావించి రాజీనామా చేసి ఉంటారనేది జై రాం రమేశ్ ట్వీట్ సారాంశం. అయితే, వర్షాకాల సమావేశాల తొలి రోజు జరిగిన పరిణామాలే ధన్‌ఖడ్ రాజీనామాకు దారి తీసి ఉంటాయనే వాదన కూడా ఉంది.

ఇంట్లో నోట్ల కట్టలు పట్టుబడిన ఉదంతంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనను కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసుకు ధన్‌ఖడ్ అంగీకరించడం ఆయన రాజీనామాకు కారణమయిందనేది విశ్వసనీయ వర్గాల కథనం. ఓవైపు జస్టిస్ వర్మ అభిశంసనకోసం లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ధన్‌ఖడ్ స్వీకరించడం ప్రభుత్వానికి మింగుడుపడలేదని అంటున్నారు. కనీసం ప్రభుత్వానికి మాటమాత్రమైనా సమాచారం ఇవ్వకుండా ప్రతిపక్షాల నోటీసును స్వీకరించడంతో క్రెడిట్ అంతా ప్రతిపక్షాలకు వెళ్లిపోయినట్లయిందని ప్రభుత్వం భావించినట్లు చెబుతున్నారు. బిజెపి వ్యక్తి అయిన ధన్‌ఖడ్ తన చర్య ద్వారా ‘లక్ష్మణ రేఖ’ దాటారని ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో సీనియర్ మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇదే ధన్‌ఖడ్ రాజీనామాకు దారి తీసి ఉంటుందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. వాస్తవానికి ధన్‌ఖడ్ మొదటినుంచి కూడా ముక్కుసూటి మనిషిగానే గుర్తింపు పొందారు.

న్యాయవాదిగా, ఆ తర్వాత కేంద్రమంత్రిగా, చివరగా పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన సమయంలోను సిద్ధాంతాలకు, నైతిక విలువలకు కట్టుబడే పని చేశారు. అందుకు ఆయన వివాదాస్పదుడుగా పేరు తెచ్చుకున్నారు. బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన రెండేళ్ల కాలంలో ‘ఫైర్‌బ్రాండ్’గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒకానొక సమయంలో గవర్నర్‌ను రీకాల్ చేయాలని మమత కేంద్రాన్ని కోరారంటే ఆయన ఎంత చండశాసనుడిగా పని చేశారో అర్థమవుతుంది. రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఆయన ప్రతిపక్షాల ఒత్తిడికి ఏమాత్రం లొంగలేదు సరికదా కొంతమేరకు ప్రభుత్వానికి ఊరట కలిగించే నిర్ణయాలే తీసుకున్నారు. ఈ కారణంగా ఒక దశలో ధన్‌ఖడ్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కూడా ప్రతిపక్షాలు యోచించాయి.

అలాంటి వ్యక్తి హఠాత్తుగా ఇప్పుడు అధికార పక్షానికి గిట్టని వ్యక్తిగా మారిపోవడం వింతే. ఆరోగ్య కారణాలవల్ల రాజీనామా చేసినట్లు చెబుతున్నా ఆయనకు పెద్దగా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ఎప్పుడూ వార్తలు రాలేదు. నెలరోజలు క్రితం కుమావో యూనివర్శిటీ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన కాస్త అస్వస్థతకు లోనయ్యారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్లు ధన్‌ఖడ్ గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఆయన చలాకీగా, ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపించేవారు. ఇదిలా ఉంటే ధన్‌ఖడ్ రాజీనామా చేసిన తర్వాత బిజెపి నేతలు ఎవరు కూడా ఆయనను పరామర్శించిన పాపానపోలేదు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఒక ప్రకటనతో సరిపెట్టారు. అంతటి ఉన్నత పదవిలో కొనసాగిన వ్యక్తికి రాజ్యసభ ఎంపిలు కనీసం వీడ్కోలు పలక లేదు. ఇటీవలి కాలంలో ఏ నేతకు కూడా ఇంత అవమానం జరగలేదేమో. ఇది బిజెపి ప్రభుత్వానికి ఏమాత్రం శోభనివ్వదనేది మాత్రం నిజం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News