పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే
అనూహ్య నిర్ణయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు
లేఖ అనారోగ్య కారణాలు, వైద్యుల సలహా
మేరకు పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడి
పదవీకాలంలో మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి ,
ప్రధాని, పార్లమెంట్ సభ్యులకు కృతజ్ఞతలు
ఐదేళ్లు పూర్తి కాకుండానే రాజీనామా చేసిన
ఏడో ఉపరాష్ట్రపతిగా రికార్డుల్లోకి ధన్‌ఖడ్
ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీష్ ధన్‌కర్ సోమవారం రాత్రి తమ పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభం రోజునే ఆయన రాజీనామా కలకలం రేపింది. తొలిరోజు సెషన్‌కు సారధ్యం వహించిన తరువాత కొద్ది సేపటికి ఆయన రాజీనామా ప్రకటన వెలువడింది. రాష్ట్రపతి కార్యాలయానికి ఆయన రాజీనామా లేఖ పంపించారు. 74 సంవత్సరాల ధన్‌కర్ తన అనారోగ్య సమస్యల వల్ల రాజీనామా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఉప రాష్ట్రపతిగా 2022 నుంచి పదవిలో ఉన్నారు. రాజ్యాంగ అధికరణ 67 ఎ మేరకు ఆయన రాజీనామా తక్షణం అమలులోకి వస్తుంది. రాష్ట్రపతికి, ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విధి నిర్వహణాలో వారి మద్దతు తనకు స్ఫూర్తినిచ్చిందని వ్యాఖ్యానించారు. ఆరోగ్యానికి తగు ప్రాదాన్యత ఇవ్వాల్సి ఉంది.
వైద్యుల సలహా మేరకు పదవి నుంచి వైదొలుగుతున్నానని ఆయన తమ ప్రకటనలో తెలిపారు. ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాజీనామా ప్రకటన వెలువడింది. ఇన్నేళ్ల తమ పదవికాలంలో తనకు మంత్రి మండలి నుంచి, ఎంపిల నుంచి ఇతరుల నుంచి అందిన సహాయసహకారాలు ఎనలేనివి అని, ఇవి చిరకాలం గుర్తుంటాయని చెప్పారు. రాష్ట్రపతికి ధన్‌కర్ పంపించిన రాజీనామా లేఖ ఆ తరువాత పత్రికలకు విడుదల చేశారు. గొప్ప ప్రజాస్వామిక దేశానికి ఉప రాష్ట్రపతి హోదాలో విలువైన అనుభవం సంతరించుకున్నానని తెలిపారు. ఇందుకు సభకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. దేశం సమున్నత రీతిలో ముందుకు సాగుతున్న పరిణాత్మక దశలో ఈ పదవిలో ఉండటం తనకు గర్వకారణం అన్నారు. దేశం గణనీయ ఆర్థిక పురోగతిలో ఉంది. అన్ని రంగాలలో ప్రగతి పథంలో సాగుతోందని , ఇది అందరికీ గర్వకారణం అన్నారు.