అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల యుద్ధంతో పార్లమెంట్ సమావేశాలు చాలా వాడి వేడీగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ ను “కొత్త చైనా గురువు” అంటూ పరోక్ష దాడి చేశారు. లోక్ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీని విమర్శించారు. డోక్లాం సంక్షోభం వంటి కీలక సమయాల్లో భారత ప్రభుత్వం వివరణ గురించి చైనా రాయబారి నుండి ప్రైవేట్ ట్యూషన్ తీసుకోవడానికి కాంగ్రెస్ నాయకుడు ఇష్టపడతారని జైశంకర్ అన్నారు. 2017 డోక్లాం ప్రతిష్టంభన సమయంలో, భారత వైఖరిని సపోర్ట్ చేయకుండా.. చైనా రాయబారిని కలిశారని జైశంకర్ గుర్తు చేశారు. “డోక్లాం సంక్షోభం కొనసాగుతోంది. మన సైన్యం చైనా సైన్యాన్ని ఎదుర్కొంటుండగా, ప్రతిపక్ష నాయకుడు.. మన ప్రభుత్వం లేదా MEA నుండి కాకుండా, చైనా రాయబారి నుండి వివరణ తీసుకునేందుకు ఎంచుకున్నారు” అని జైశంకర్ విమర్శించారు.
కాగా, చైనాతో కాంగ్రెస్ అనుమానాస్పద సంబంధాలను కలిగి ఉందని జైశంకర్ ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. జూలై 25న, కాంగ్రెస్ కు చైనాతో “రహస్య ఒప్పందాల” దీర్ఘకాల చరిత్ర ఉందని ఆయన ఆరోపించారు. వారి ఒప్పందాలు దేశ సార్వభౌమత్వాన్ని, వ్యూహాత్మక స్థితిని నిరంతరం రాజీ పడేలా చేశాయని అన్నారు. 1962 ఇండో-చైనా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ విధానాలే బలహీనమైన భౌగోళిక రాజకీయ స్థానానికి కారణమని ఆరోపించారు. దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా.. పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పదేపదే విఫలమైందని జైశంకర్ ఆరోపించారు.