Friday, August 15, 2025

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. 65కు చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/కిస్తివార్ : జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో క్లౌడ్ బరస్ట్ ఘోర విషాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో మృతుల సంఖ్య 46 నుంచి 65 కి చేరింది. 100 మంది కన్నా ఎక్కువ మంది గాయపడ్డారు. దాదాపు 200 మంది గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది . సంఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్మీకూడా రంగం లోకి దిగింది. ఇప్పటివరకు 30 మృతదేహాలను అధికారులు గుర్తించారు. 190 మందిని రక్షించినట్టు తెలుస్తోంది.

శిథిలాల కింద 500 మంది పైనే: ఫరూక్ అబ్దుల్లా
ఈ విపత్తులో 500 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్టు భావిస్తున్నానని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. కొందరు అధికారులు ఈ సంఖ్య 1000 వరకు దాటొచ్చని చెబుతున్నారని, ఇది తీవ్ర విషాదకరమైన క్షణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాద పరిస్థితిపై ప్రధాని మోడీ వాకబు
ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉదయం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలతో ఈ విపత్తు గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రధానితో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చొసితి గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తానని చెప్పారు. దీనిపై ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. “జమ్ము కశ్మీర్ ఎల్‌జి, ముఖ్యమంత్రి ఒమర మాట్లాడాను. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు ” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్‌ఖాతాలో పోస్టు పెట్టారు. “ ఇప్పుడే ప్రధాని మోడీతో మాట్లాడాను. కిశ్త్‌వాడ్ లోని పరిస్థితుల గురించి వివరించాను. ఆయన మద్దతు, సాయానికి తమ ప్రభుత్వం , బాధిత ప్రజలు ఎంతో రుణపడి ఉండారు ” అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రగాఢ సానుభూతి
అంతకు ముందు శ్రీనగర్ బక్షి స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సభలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ 65 మంది ప్రాణాలు కోల్పోయారని, వందమంది కన్నా ఎక్కువ మంది గాయపడ్డారని చెప్పారు. ఈ విపత్తులో ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ఎంతో విలువైన ప్రాణాలను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతన్నాయని చెప్పారు.

మృతుల గుర్తింపునకు ప్రయత్నాలు
మృతులను గుర్తించడానికి అధికార యంత్రాంగం అనేక ప్రయత్నాలు చేస్తోంది. వారి ఫోటోలను వాట్సాప్‌ల ద్వారా వారి కుటుంబాలకు పంపిస్తోంది. ఫలితంగా ఇంతవరకు 30 మందిని గుర్తించే వీలు కలిగింది. రక్షించబడిన 160 మందిలో 38 మంది పరిస్థితి క్లిష్టంగా ఉంది. ప్రమాదస్థలం చోసితికి 15 కిమీ దూరంలో పడ్డార్ వద్ద అధికార యంత్రాంగం యాత్రికుల సహాయంగా కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్‌లో ఐదుగురు అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు. వివరాలు తెలుసుకోడానికి వీలుగా 9858223125, 600671934, 9797504078, 8492886895, 8493801381, 7006463710 ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. హెల్ప్ ఏర్పాటు చేసినదగ్గర నుంచి అనేక కాల్సును తీసుకున్నారు.

చోసితిలో హృదయ విదారక దృశ్యాలు
చోసితిలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితోపాటు , స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు, సహాయ చర్యలో పాల్గొన్నారు. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను గుర్తించి ఆస్పత్రికి తరలిస్తున్నారు. గురువారం నుంచి ఇప్పటి దాకా, 200 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రాళ్ల తాకిడికి మృతదేహాలు ఛిద్రమై, శరీరం లోపలి అవయవాలు బయటకు వచ్చి, గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. చీనాబ్ నదిలో 10 మృతదేహాలు తేలుతున్నాయని చోసితి గ్రామస్తులు చెప్పారు. వర్షం కురుస్తున్నప్పటికీ సహాయ కార్యక్రమాలు ఆగడం లేదు.

శుక్రవారం ఉదయం నుంచే బాధితుల కోసం వెతుకుతున్నారు. ఎర్త్‌మూవర్ యంత్రాలు బురదమేటలను తవ్వుతున్నాయి. కూలిన చెట్లను విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి జావేద్‌దార్ తోపాటు కిస్తివాడ్ ఎస్‌పి నరేష్ సింగ్ ఆ ప్రాంతంలోనే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. దేశం లోని నలుమూలల నుంచి భారీగా భక్తులు కిస్త్‌వార్‌లోని మాచైల్ మాత ఆలయానికి వస్తూ ఉంటారు. జులై 25న ఈ యాత్ర ప్రారంభమైంది. యాత్రకు వెళ్లే వారికి చోసితి గ్రామమే బేస్ పాయింట్. ఇక్కడ యాత్రికుల కోసం సామూహిక వంటకాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే వాహనాలను వదిలి భక్తులు కాలినడకన మాచైల్ మాత గుడికి వెళ్తారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదం జరగడం అత్యంత విషాదకరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News