ప్రపంచ పురుషుల టెన్నిస్‌పై ఇటలీ సంచలనం జన్నిక్ సినర్ తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు గెలిచి ఎదురులేని శక్తిగా మారాడు. 2025లో జరిగిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ సినర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అంతకుముందు 2024 చివర్లో జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లోనూ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ తుది పోరుకు అర్హత సాధించి పెను ప్రకంపనలు సృష్టించాడు. అతని ఆట ఫెదరర్, జకోవిచ్‌లను తలపిస్తోంది. అన్ని గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో కూడా సినర్ నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు. కెరీర్‌లో ఒక్క ఫ్రెంచ్ ఓపెన్ తప్పించి మిగిలిన గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను వరుసగా రెండు సార్లు సొంతం చేసుకున్నాడు.
2024, 2025లలో సినర్ ఈ టైటిల్స్ దక్కించుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి కార్లొస్ అల్కరాజ్‌తో చివరి వరకు పోరాడి ఓడాడు. రొనాల్డ్ గారోస్‌లో ఎదురైన పరాజయానికి వింబుల్డన్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు. హ్యాట్రిక్ వింబుల్డన్ టైటిల్స్ సాధించాలని భావించిన అల్కరాజ్ కలను నీరుగార్చాడు. నాదల్, ఫెదరర్‌లు ఇప్పటికే ఆటకు వీడ్కోలు పలకడం, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోటీ అల్కరాజ్, సినర్‌ల మధ్యనే నెలకొంది. కిందటి సీజన్‌లో ఇద్దరు రెండేసి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలను గెలుచుకున్నారు. ఈసారి సినర్ రెండు టైటిల్స్‌తో పైచేయిలో నిలిచాడు. వచ్చే నెలలో జరిగే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో గెలిచి అల్కరాజ్‌ను వెనక్కి నెట్టాలని సినర్ తహతహలాడుతున్నాడు.
వింబుల్డన్‌లో కళ్లు చెదిరే రికార్డు కలిగిన అల్కరాజ్‌ను ఫైనల్లో మట్టికరిపించి సినర్ సత్తా చాటాడు. ప్రస్తుతం పురుషుల సింగిల్స్ విభాగంలో సినర్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. వింబుల్డన్ టైటిల్‌తో దీన్ని మరింత పదిలం చేసుకున్నాడు. టైటిల్ సాధించే క్రమంలో స్టార్ ఆటగాళ్లు జకోవిచ్, అల్కరాజ్‌లను ఓడించాడు. దీంతో సినర్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. రానున్నరోజుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.