టోక్యో : భారతదేశంలో వచ్చే దశాబ్ద కాలంలో 10 ట్రిలియన్ యెన్‌లు (రూ.6లక్షల కోట్లు) పె ట్టుబడులు పెట్టేందుకు జపాన్ సంసిద్ధమైంది. ఉభయదేశాల రక్షణ సంబంధాల ఫ్రేమ్ వర్క్, ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు పది సంవత్సరాల రోడ్ మ్యాప్ సిద్ధమైం ది. ఉభయ దేశాల మద్య ఈ మేరకు పెద్ద ఒ ప్పందాలు కుదిరాయి. అమెరికా వాణిజ్య విధానాల వల్ల ఏర్పడిన కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయాలు చోటుచేసుకున్నాయి.భారత ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా మధ్య శిఖరాగ్ర చర్చల నేపథ్యంలో ఉభయదేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వాన్ని మరింత విస్తరించేందుకు కొత్త నిర్ణయాలు ఆవిషృ్కతమయ్యాయి.
సెమీ కండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, టెలికాం, ఫార్మస్యూటికల్స్, కీలకమైన ఖనిజాలు, కొత్త సాంకేతిక, వ్యూహాత్మక రంగాలలో పరస్పర సహకారానికి సంబంధించి రెండు కీలక ఒప్పందాలపై అంగీకారం కుదిరింది. ఆసియాలో రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, శక్తివంతమైన ప్రజాస్వామ్యదేశాలైన భారత జపాన్‌ల భాగస్వామ్యం ఉభయదేశాలకే కాకుండా ప్రపంచశాంతి సుస్థిరతకు కీలకమైనదని ఇద్దరు నాయకులు వెల్లడించారు. మెరుగైన ప్రపంచ రూపకల్పనలో రెండు ప్రజాస్వామిక దేశాలు సహజ భాగస్వాములని మోదీ, ఇషిబా పేర్కొన్నారు. భారతదేశం, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంలో సువర్ణాధ్యాయానికి పునాది పడిందని, రానున్నదశాబ్దికాలానికి సంబంధించి ఓ రోడ్ మ్యాప్‌ను నిర్దేశించుకున్నామని,ప్రధాని మోదీ అన్నారు.
రానున్న పదేళ్లలో భారతదేశం లో జపాన్ 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడిని పెట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నదని ప్రధాని వెల్లడించారు. ఈ ఒప్పందాల్లో ఒకటి రానున్న ఐదేళ్లలో భారతదేశం నుంచి 50 వేల మంది నైపుణ్యం కలిగిన, సెమీ- స్కిల్డ్ సిబ్బంది రాకపోకలను ప్రోత్సహించేందుకు సంబంధించినది కాగా రెండోది డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కు సంబంధించినది. పదేళ్ల రోడ్ మ్యాప్ లో ఆర్థిక పరమైన భద్రత, పర్యావరణ స్థిరీకరణ, సాంకేతిక విజ్ఞానం, ఆరోగ్యం, నవీన ఆవిష్కరణ వంటి రంగాలు ఉన్నాయి. కీలక ఖనిజాలు సరఫరా, ప్రాసెసింగ్ టెక్నాలజీల అభివృద్ధి, అన్వేషణ, మైనింగ్ రెంగంలో ఉమ్మడి పెట్టుబడులు, హెడ్రోజన్ , అమ్మోనియా వంటి ప్రాజెక్టుల ప్రోత్సాహంకోసం ఉభయదేశాలు కృషి చేస్తాయి. ఉభయ ప్రధానులు తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితి పట్ల వ్యూహాత్మక జలాల్లో చైనా సైనిక బలగాలు, ఆయుధ సంపత్తి పెరుగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాస్పద ప్రాంతాలలో సైనికీకరణపట్ల వారు తమ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సముద్ర వివాదాలను శాంతీయుతంగా, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టంపై సమావేశం నిర్దేశించిన విధంగా పరిష్కరించుకోవాలని భారత జపాన్ దేశాల సంయుక్త ప్రకటన తెలిపింది.