Monday, September 8, 2025

జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా రాజీనామా

- Advertisement -
- Advertisement -

టోక్యో : జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తమ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తమ నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్‌డిపి) పరాజయం చెందింది. అప్పటి నుంచి కూడా ఆయనపై పార్టీ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. పరాజయానికి బాధ్యత వహించాలని పట్టుపడుతున్నారు. గత ఏడాది పుమియో కిషిదా రాజీనామా తరువాత జరిగిన అధికార పార్టీలో జరిగిన అంతర్గత ఎన్నికలలో విజయం సాధించి నేత అయిన ఇషిబా అక్టోబర్ నుంచి ఈ బాధ్యతలలో ఉన్నారు.

అయితే జులైలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓడింది. మైనార్టీ ప్రభుత్వం సాగుతోంది. ఈ దశలో అప్పటి నుంచి కూడా ఆయన రాజీనామాకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఉన్నట్టుండి పదవికి రాజీనామా చేస్తే రాజకీయ శూన్యత ఏర్పడుతుందని, దేశంలోనూ వెలుపల నుంచి కూడా తలెత్తిన కీలక సవాళ్లను తట్టుకోవడం కష్టం అవుతుందని చెపుతూ ఆయన జులై నుంచి కూడా రాజీనామాకు ససేమిరా అంటూ వచ్చారు. సోమవారమే పార్టీ కీలక భేటీ జరగాల్సి ఉంది. పార్టీ నాయకత్వానికి ముందస్తు ఎన్నికలు జరపాలా? లేదా ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాసం తీసుకురావాలా? అనేది ఈ భేటీలో నిర్థారించాలని నిర్ణయించారు. అయితే ముందురోజే ఆయన తమ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ నిర్ణయం వెలువరించారు. పార్టీ వర్గాలే ఇక నాయకత్వ ఖాళీ భర్తీ విషయాన్ని నిర్ణయించుకోవల్సి ఉంటుంది. తనకు సంబంధించి సోమవారం ఎటువంటి నిర్ణయం అవసరం లేదని తెలిపారు. పార్టీలో వర్గపోరు పెరిగినందున దీనిని నివారించేందుకు ఆయన ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నందునే పదవి నుంచి వైదొలిగినట్లు స్పష్టం అయింది.

దేశ అత్యంత కీలక పార్లమెంటరీ ఎన్నికలలో ఇషిబా సంకీర్ణ ప్రభుత్వం ఎగువ సభలో స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయింది. తరువాత దిగువసభకు జరిగిన ఎన్నికల్లోనూ సరైన ఫలితం రాకపోవడంతో ఆయన ప్రభుత్వం డోలాయమాన స్థితిలో కూరుకుంది. శనివారం ఇషిబా తమ రాజకీయ భవితవ్యం గురించి దేశ వ్యవసాయ శాఖ మంత్రి షిజిరో కోయిజుమితో, మాజీ ప్రధాని యోషిడే సుగాతో విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ గురువు అయిన సుగా సూచనల మేరకు ఇషిబా పదవి నుంచి వైదొలిగారు. జపాన్ ఇప్పుడు అమెరికా భారీ సుంకాలు, ఆర్థిక రంగంపై ప్రభావం, పెరుగుతున్న ధరలు, ప్రత్యేకించి వరి ధాన్యం విధానం సంస్కరణలు, ఈ ప్రాంతంలో తలెత్తుతున్న ఉద్రిక్తతలు వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు వచ్చిపడే నాయకత్వ సమస్య పరిస్థితిని మరింతగా దిగజార్చే అవకాశం ఉంది.

Read Also: పాక్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. మ్యాచ్‌ జరుగుతుండగా బాంబు దాడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News