దేశ వ్యాప్తంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల పనితీరులో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాయం 24వ ర్యాంకు దక్కించుకున్నుట్ల ఉప కులపతి అల్ధాస్ జానయ్య గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి నిర్వహించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్( నేషన్ ఇన్సిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) సర్వే నివేదికను విడుదల చేసిందన్నారు. ఈ జాబితాలో జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 24వ ర్యాంకు సాధించిందని, ఇది గతేడాదితో పోల్చితే 13 ర్యాంకులు మెరుగుదల ఆయన తెలిపారు. 2015లో ఆరవ ర్యాంకు సాధించగా, 2023 సంవత్సరానికి 37వ ర్యాంకుకు పడిపోయిందని ఆయన వివరించారు. ప్రభుత్వం మద్దతు, సిబ్బంది కృషితో విశ్వవిద్యాలయం పనితీరు మెరుగుపరుచుకుని 24వ ర్యాంకు సాధించిందని ఆయన పేర్కొన్నారు.
దక్షిణాదిలోని వ్యవసాయ, వ్యసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో పిజెటిఏయు నాల్గవ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. పది నెలల క్రితం పిజెటిఏయు ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్దతో అనేక కార్యక్రమాలు నిర్వహించానని, దీంతో ర్యాంకు మెరుగుపడిందని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో ప్రత్యేకంగా నాలుగు ఆధునిక పరిశోధన కేంద్రాలు ప్రారంభించామని ఆయన చెప్పారు. మానవ రహిత వ్యవసాయమే ధ్యేయంగా డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెంపునకు సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్‌ను, సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణ పరిశోధనలకు గాను సెంటర్ ఫర నేచురల్ రీసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్‌ను, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సిస్టమ్న్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బోధన, భోదనేతర సిబ్బందిలో నైపుణ్యాల పెంపుదలకి సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌ను ఏర్పాటు చేశామన్నారు.
సహజ వనరుల పరిరక్షణ, యూరియా, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, నీటి సమర్ధ యాజమాన్యం వంటి ముఖ్యమైన అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసి సుమారు 12వేల గ్రామాల్లో, లక్షా 20వేల మంది రైతులను శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా కలిసి అవగాహాన కల్పించామని వివరించారు. 11వేల గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు నాణ్యమైన 40వేల విత్తన కిట్లను పంపిణీ చేశామని జానయ్య వెల్లడించారు. సామాన్యులకు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వ్యవసాయ విద్యను చేరువ చేయాలన్న ఉద్దేశంతో సీట్లను పెంచి, ఫీజులు తగ్గించామని, వ్యవసాయ కూలీల పిల్లలకు ప్రత్యేక సీట్లు కేటాయించినట్లు ఆయన గుర్తు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని విస్తృత పరిశోధనలు చేపట్టామని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శులు సహకారంతో ఈ ర్యాంకు సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో మెరుగైన ర్యాంకును సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.