Monday, September 8, 2025

వెనిజులాపై సైనిక చర్య మంచిదే: జెడి వాన్స్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : వెనిజులాపై సైనిక చర్యకు పాల్పడటం మంచిదేనని అమెరికా ఉపాధ్యక్షులు జెడి వాన్స్ స్పష్టం చేశారు. వెనిజులా డ్రగ్స్ నౌకపై ఇటీవలి అమెరికా సైనిక చర్యను ఆయన సమర్థించారు. అయితే అమెరికా చర్యపై ప్రపంచదేశాలనుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. ట్రంప్ అధికార యంత్రాంగం అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘించిందని , ఏకంగా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని స్పందనలు వెలువడ్డాయి. అమెరికా చర్యలో 11 మంది చనిపోయారు. ఈ దశలోనే వాన్స్ మినియాపోలిస్ సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రెస్‌తో ఆదివారం మాట్లాడారు. వెనుజులా దారుణంతో పోలిస్తే తాము చేసింది తక్కువే అని వ్యాఖ్యానించారు. తమ దేశ పౌరులను డ్రగ్స్ ద్వారా విషపూరితులు చేస్తున్న వారికి తమ సైనికులు తగు శిక్షనే విధించారని చెప్పారు.

ఇది తమ సైన్యం ద్వారా చేపట్టిన అత్యున్నత, ఉత్తమ చర్య అని సమర్థించారు. ఆయన వ్యాఖ్యలను లిబరల్ కామెంటేటర్ బ్రెయిన్ క్రసెన్‌స్టియిన్ తప్పుపట్టారు. లాటిన్ అమెరికాపై ట్రంప్ వైఖరి శృతి మించిందని అన్నారు. దాడి యుద్ధ నేరం కిందికే వస్తుందని, ఇతర దేశాల వారు సాధారణ పౌరులు వారిని ఈ విధంగా నిబంధనలను బేఖాతరు చేస్తూ మట్టుపెట్టడం దారుణం అని మండిపడ్డారు. యుద్ధ నేరాలకు పాల్పడటం పైగా ట్రంప్ ఆయన జూనియర్ వెనుకేసుకురావడం గర్హనీయం అని విమర్శించారు. దీనిపై వాన్స్ విరుచుకుపడ్డారు. తప్పుడు కూతలకు జవాబు ఇవ్వాల్సిన పనిలేదన్నారు. ప్రస్తుత విమర్శల దశలోనే ట్రంప్ వెనిజులా లోతట్టు ప్రాంతాలను ఎంచుకుని భీకర దాడులద్వారా సైనిక చర్యలకు పాల్పడాలని సంకల్పించారు.

దీనితో కరీబియన్ ప్రాంతంలో ప్రచ్ఛన్న యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ ప్రాంతంలో తిరిగే డ్రగ్స్ రవాణా నౌకలు, వాహనాలను లక్షంగా చేసుకుని సైనికచర్యకు దిగినా, ఇది ఇక్కడ పరస్పర యుద్ధానికి దారితీస్తుంది. అమెరికా సరిహద్దుల వెంబడి మాదకద్రవ్యాల రవాణా, ప్రవేశాలను అరికట్టేందుకు ట్రంప్ ఆదేశాల మేరకు దక్షిణ కరేబియన్ ప్రాంతంలోకి అమెరికా సేనలు వచ్చిచేరాయి. దీనితో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. వెనిజులా ప్రెసిడెంట్ నికోలాస్ మదురో ప్రభుత్వానికి ఈ ప్రాంతంలోని డ్రగ్స్ గ్యాంగ్‌లతో నేరుగా సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరిలోనే అమెరికా అక్కడి ట్రెన్ డి ఆరాగువా సంస్థ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆరోపించింది. దీనిని డ్రగ్స్ రవాణా చేసే విదేశీ ఉగ్రవాద బృందంగా పేర్కొంది. దీనికి తమతో లింక్ ఉందనే ట్రంప్ వాదనను మదురో ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ గ్రూప్‌ను తాము 2023 లో చేపట్టిన జైలు దాడి దశలోనే తుదముట్టించామని, అధికారిక వ్యవస్థకు దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

Also Read: రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ సిద్ధం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News