ఉదయం 9గంటల నుంచి
పేపర్1, మధ్యాహ్నం
2.30గంటల నుంచి పేపర్2
ఆభరణాలు, పెద్ద బటన్లు ఉన్న
దుస్తులు ధరించరాదు
బూట్లకు అనుమతి లేదు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బి.టెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బిఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం(మే 17) జెఇఇ అడ్వాన్స్‌డ్ -2025 (JEE Advanced exam)పరీక్ష నిర్వహించనున్నారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగనున్నది.
ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ కాన్పుర్ అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జెఇఇ మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2,50,236 మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ రాయడానికి అవకాశం ఇవ్వగా.. సుమారు 1.85 లక్షల మందే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది హాజరవుతారని అంచనా. గత ఏడాది 1,80,200 మంది అడ్వాన్స్‌డ్ రాశారు. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారు బి.ఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే జూన్ 5న నిర్వహించే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఎఎటి) రాయాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలు పాటించాలి
జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఇతర అధికారిక గుర్తింపుకార్డు తీసుకురావాలి. పెన్, పెన్సిల్‌తోపాటు పారదర్శకంగా ఉంటే వాటర్ బాటిల్‌ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన తర్వాత విద్యార్థులకు కేటాయించిన సీట్ల వద్ద కంప్యూటర్ స్క్రీన్‌పై రోల్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. పెన్, పెన్సిల్ విద్యార్థులే తెచ్చుకోవాలి. వీటిని పరీక్ష కేంద్రంలో ఇవ్వరు. గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష సమయానికి పరీక్షా హాలులోకి అనుమతిస్తారు. పేపర్ 1కు ఉదయం 7 గంటల వరకు నుంచి పేపర్ 2కు మధ్యాహ్నం 1 గంట వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలి.
పరీక్ష ప్రారంభ సమయం తరువాత ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను లోపలకు అనుమతించరు. పరీక్ష ముగిసేవరకు బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఐఐటీ కాన్పూర్ డ్రెస్ కోడ్ కూడా జారీ చేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష హాలులో ఉంగరాలు, కంకణాలు, చెవి రింగులు, ముక్కు పిన్నులు, తాయెత్తులు, పెద్ద చెవిపోగులు, చైన్‌లు, నెక్లెస్‌లు, కంచాలు ధరించకూడదు. ఆభరణాలతోపాటు అభ్యర్థులు చొక్కా, కుర్తీ లేదా సాంప్రదాయ కుర్తా అయినా పెద్ద బటన్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. విద్యార్థులు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలని ఐఐటీ కాన్పూర్ మార్గదర్శకాలలో తెలిపింది.
పరీక్షా కేంద్రాలలోకి ఫోన్లు, పెన్‌డ్రైవ్, బ్లూటూత్, వాచ్‌లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతి ఉండదు. తెలంగాణలో హైదరాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, సూర్యాపేట, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, మైలవరం, విజయవాడ, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, చీరాల, మార్కాపురం, గూడూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు పట్టణాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జెఇఇ అడ్వాన్స్‌డ్ 2025 షెడ్యూల్ (JEE Advanced exam)
మే 18 : పరీక్ష నిర్వహణ(ఉదయం 9- నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి- 5.30 గంటల వరకు పేపర్ -2)
మే 22 : వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు
మే 26 : ప్రాథమిక కీ విడుదల
జూన్ 2: ఉదయం 10 గంటలకు తుది కీ, ఫలితాలు విడుదల
జూన్ 3 సాయంత్రం 5 గంటలు: జోసా కౌన్సెలింగ్ ప్రారంభం