110 మంది మెయిన్ 2 విద్యార్థుల
ఫలితాలు నిలిపివేత
మన తెలంగాణ/హైదరాబాద్: జెఇఇ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నది. అర్హులైన విద్యార్థులు మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జెఇఇ మెయిన్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయించి, టాప్ 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 18న జరగనుండగా, ఫలితాలు జూన్ 2న విడుదల కానున్నాయి. కాగా, జెఇఇ మెయిన్ సెషన్ 2 ఫలితాలలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపర్సంటైల్ స్కోర్‌ను శుక్రవారం రాత్రి వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో 110 మంది జెఇఇ మెయిన్ విద్యార్థుల ఫలితాలను ఎన్‌టిఎ నిలిపివేసింది. ఆ విద్యార్థులు అక్రమాలకు పాల్పడ్డారని, ఫోర్జరీ పత్రాలు ఉపయోగించినట్లు గుర్తించామని ఎన్‌టిఎ అధికారులు తెలిపారు. జెఇఇ మెయిన్ ఫలితాలలో జనరల్ విభాగంలో 93.102, ఇడబ్లూఎస్‌లో 80.383, ఒబిసి కేటగిరీలో 79.431, ఎస్‌సి విభాగంలో 61.15, ఎస్‌టిలో 47.90 పర్సంటైల్ స్కోర్‌ను కటాఫ్‌గా నిర్ణయించారు. ఈ స్కోర్‌కు సమానం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ పొందినవారు మాత్రమే మే 18న జరుగనున్న జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు.