శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీలం నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నది ప్రవాహ పరిస్థితిని అధికారులు పర్యవేక్షించి, లోతట్టు ప్రాంతాలలో వరదలు సంభవించే అవకాశం ఉండటంతో హెచ్చరిక జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేంద్రపాలిత ప్రాంతం (UT)లో పలు ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రజలకు అవసరమైన సేవలను అందించడం, క్లిష్టమైన ప్రాంతాల్లో సకాలంలో తరలింపులు చేపట్టడం, తక్షణ ఉపశమనం అందించడం వంటివి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అధికారుల సూచనలు, సలహాలను పాటించాలని, దుర్బల ప్రాంతాలను వీడి సురక్షితంగా ఉండాలని అబ్దుల్లా ప్రజలు కోరారు.