లండన్: లార్డ్స్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ (Joe Root) సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటనే రూట్ మూడంకెల స్కోర్‌ను దాటాడు. బుమ్రా వేసిన మొదటి బంతిని బౌండరీగా మలిచిన రూట్.. సెంచరీ సాధించడంతో పాటు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్‌ను రూట్ అధిగమించాడు. ఈ సెంచరీతో టెస్టుల్లో రూట్ 37 సెంచరీలు సాధించాడు. రూట్ కంటే ముందు ఈ జాబితాలో టాప్ నుంచి సచిన్ టెండూల్కర్ 51, జాక్వెస్ కల్లిస్ 45, రికి పాంటింగ్ 41, కుమార సంగక్కరా 38 ఉన్నారు.
ఇక రూట్ (Joe Root) సెంచరీతో పెరిగిన ఇంగ్లండ్ జోరుకు బుమ్రా బ్రేక్ వేశాడు. 86వ ఓవర్ రెండో బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(44)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన జెమీ స్మిత్ సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీ సాధించి టెస్ట్ కెరీర్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాక.. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు సాధించిన వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్ రికార్డును (21 ఇన్నింగ్స్) సమయం చేశాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన 88వ ఓవర్ తొలి బంతికి రూట్(104) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే వోక్స్ (0) జురెల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 88 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. క్రీజ్‌లో జేమీ స్మిత్ (10), బ్రైడాన్ కార్స్ (0) ఉన్నారు.