ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని, ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ, యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనా కార్యక్రమంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖండించారు. తక్షణమే అరస్టయిన వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. నేటికి కేవలం 56 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. జాబ్ క్యాలండర్ అమలు పరుస్తామని హైదరాబాదు డిక్లరేషన్‌లో చెప్పారన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.4 వేలు ఇస్తామని చెప్పిందని వెల్లడించారు.
రాజీవ్ యువ వికాస పథకం ప్రవేశపెట్టిందని, జూన్ 2న నియామక పత్రాలు ఇస్తామని ఆర్భాటం చేసి ప్రచారం చేసిందని, ఇవేమీ అమలు చేయలేదన్నారు. దీనితో శుక్రవారం నిరుద్యోగ జెఎసితో పాటు డివైఎఫ్‌ఐ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తే, రాష్ట్ర వ్యాప్తంగా 220 మంది జెఎసి నిరుద్యోగులను, డివైఎఫ్‌ఐ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసిందన్నారు. హైదరాబాదులో సెక్రెటేరియట్ ముట్టడికి వెళ్తూ డివైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు వెంకటేష్, కోట రమేష్‌లతో పాటు అనేక మందిని అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లలో నిర్భందించారన్నారు. నిరుద్యోగులపై ప్రభుత్వం తీవ్రమైన నిర్భందం ప్రయోగిం చడం సరైంది కాదన్నారు. అరెస్టుల మీద పెట్టిన శ్రద్ద ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద పెట్టాలని సూచించారు.