Saturday, July 19, 2025

ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్… ‘జూనియర్’ రివ్వ్యూ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి కొడుకు కిరీటీ హీరోగా పరిచయమైన సినిమా జూనియర్. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి ఈ సినిమా నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా, జెనీలియా కీలక పాత్ర పోషించిన ఈ మూవీ శుక్రవారం తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది.

కథ: అభి (కిరీటి).. నడి వయస్సులో ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన సంతానం. అతను పుట్టగానే తల్లి చనిపోతుంది. తండ్రి అతణ్ని కళ్లలో పెట్టుకుని పెంచుతాడు. కానీ తండ్రి అతి ప్రేమ కొడుక్కి భారంగా మారుతుంది. తాను కోరుకున్నట్లుగా బాల్యాన్ని గడపలేకపోయిన అభి.. కాలేజీలో సరికొత్తగా జ్ఞాపకాలను పోగేసుకుంటూ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే స్ఫూర్తి (శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. అభి, స్ఫూర్తి కలిసి ఒక ప్రాజెక్ట్ చేసి.. దాని ద్వారానే ఒక సంస్థలో ఉద్యోగాలు సంపాదిస్తారు. కానీ అక్కడ చేరిన మొదటి రోజే సంస్థ యజమాని విజయ (జెనీలియా) ఆగ్రహానికి గురవుతాడు అభి. ఆ కంపెనీని అభి వదిలి వెళ్లిపోవాల్సిన సమయంలోనే అతడికో షాకింగ్ విషయం తెలుస్తుంది.. అదేంటి.. తర్వాత తన జీవితం ఎలా మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణః
‘జూనియర్’లో అన్ని రకాలుగా తన టాలెంట్స్ చూపించడానికి మంచి ప్రయత్నమే చేశాడు కిరీటి. ఒక కొత్త హీరోనుంచి ఇంత గొప్ప డ్యాన్స్ ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. అతను చేసిన యాక్షన్ సీక్వెన్సులు కూడా అదిరిపోయాయి. నటన అద్భుతం అని చెప్పలేం కానీ అన్ని ఎమోషన్లనూ బాగానే పలికించాడు. వీటన్నింటికీ ఓ మంచి కథ కూడా తోడై ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా సాగి ఉండేది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ దాదాపుగా కాలేజీ నేపథ్యంలోనే సాగుతుంది. ఈ సన్నివేశాలు యూత్‌ను అలరిస్తాయి. హీరోయిన్ శ్రీలీలతో సాంగ్స్ ప్రేక్షకులను మైమరపించాయి. ఇంట్రో సాంగ్ నుంచి ‘వైరల్ వయ్యారి’ పాట వరకు కిరీటీ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ ప్రేక్షకులను మెప్పించాయి.

ఇక సినిమా అసలు కథ సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. కిరిటీ, జెనీలియా మధ్య సన్నివేశాలు సెంటిమెంట్‌ను పండించి కుటుంబ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. 13 ఏళ్ల తర్వాత సౌత్ సినిమాలో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా కీలకమైన పాత్రలో తన నటనతో అలరించింది. రవిచంద్రన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీలు బాగున్నాయి. వాటిని తెర మీద గ్రాండ్‌గా చిత్రీకరించారు. సెంథిల్ సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. దర్శకుడు సినిమా ముగింపులో మళ్లీ చిన్న ఎమోషనల్ ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తానికి ‘జూనియర్’ ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News