న్యూఢిల్లీ: జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్థానంలో నియమితులైన జస్టిస్ గవాయ్ తో బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్, కేరళ గవర్నర్ గా పనిచేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఆర్ఎస్ గవాయ్ కుమారుడు జస్టిస్ గవాయ్.
మహారాష్ట్రలోని అమరావతిలో నవంబర్ 24, 1960న జన్మించిన జస్టిస్ గవాయ్.. మార్చి 16, 1985న బార్‌లో చేరారు. జనవరి 17, 2000న నాగ్‌పూర్ బెంచ్‌కు ప్రభుత్వ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. నవంబర్ 14, 2003న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నవంబర్ 2005లో బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. మే 24, 2019న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది నవంబర్ 23 వరకు సిజెఐగా జస్టిస్ గవాయ్ కొనసాగనున్నారు.