ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోంది అని ఉప రాష్ట్రపతి ‘ఇండి’ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అత్యు న్నతమైన వ్యవస్థ అని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితా చిత్తు కాగితం కాదని అన్నారు. ఉప రాష్ట్రపతి పద వికీ జరగబోయే ఎన్నికలో కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పరిచయం చేసేందుకు పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఒక హోటల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎంపిలు, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారా యణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రసంగిస్తూ తనపై విమర్శలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కొందరు అనుకుంటున్నారని, అయితే తాను వెనక్కి తగ్గేదేలే అని ఆయన తెలిపారు. తనను విమర్శించే వారు సల్వాజుడుంపై తాను ఇచ్చిన తీర్పును చదవాలని ఆయన సూచించారు. తాను ఇచ్చిన తీర్పును 11 మంది న్యాయవాదులు చదివి ఒక్క వాక్యం కూడా మార్చలేదని అన్నారు. కోర్టు తీర్పుల గురించి మాట్లాడే వారు ముందుగా అది చదవాలని ఆయన తెలిపారు.రాజకీయ ముళ్ళ కిరీటం ఎందుకని కొందరు అడుగుతున్నారని, వారందరికీ ఇదే నా సమాధానం అని ఆయన రాజ్యాంగాన్ని చూపించారు. ఉప రాష్ట్రపతి పదవి రాజకీయమైంది కాదని అన్నారు.