న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు కీలకమైన భారత ఆర్మీ సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ నిఘా ఏజెంట్లతో ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రెండు రోజుల తర్వాత న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు కేక్ తీసుకువస్తున్న వ్యక్తితో మల్హోత్రా కలిసి ఉన్న ఓ ఫోటో బయటకొచ్చింది. పాకిస్తాన్ పర్యటన సందర్భంగా.. జ్యోతి తాను హాజరైన పార్టీలో కేక్ తెచ్చిన వ్యక్తిని కలిసినట్లు ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో జ్యోతిపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు.
భారత్- పాకిస్తాన్ మధ్య వివాదం తరువాత, పోలీసులు, వివిధ నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా సామాజిక వ్యతిరేక శక్తులపై చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సహకారంతో గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతోపాటు ఇప్పటిరకు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.