Monday, May 26, 2025

దళిత, బహుజన సాహిత్య వేగుచుక్క కలేకూరి

- Advertisement -
- Advertisement -

తెలుగు సాహిత్యంలో ఓ థిక్కార స్వరం కలేకూరి ప్రసాద్ కవిత్వం. 1984 నుండి 2012 మధ్యకాలంలో ఆయన కవిత్వం వెలువరించారు. నూకతోటి బాబూరావు, డప్పు ప్రకాష్, చంద్రశ్రీలు ఆయన గేయాలకు తమ గొంతులను వేదికలుగా చేసి ‘వేనోళ్ళ’కు చేరవేసారు. కుల నిర్మూలన కోసం గొంతెత్తిన కవి కలేకూరి. స్వతంత్ర రచనలకెంత ప్రాధాన్యమిచ్చారో అనుసృజనను సహితం అంతగా అక్కున చేర్చుకున్న కవి. బెంగాళీ, రష్యన్, మరాఠీ దళిత కవులను తను తెలుగు పాఠకులకు అందించారు. ఆలోచించమని అంటూ అగ్నిని రగిలించారు.

ఆయన కవిత్వంను గురించి గద్దర్ ఒక మనిషిగా గుర్తించబడని మనిషి గురించి రాసిన కవిత్వాన్ని దళిత కవిత్వమని ఎట్లా అంటారు మీరు? అది మహోన్నత కవిత్వమవుతుంది. కలేకూరి దళిత కవి కాదు. మహాకవి అంటారు. ఇది అక్షర లక్షల విలువ చేసే ఓ మాట. కలేకూరి తన రచనల ద్వారా ‘దళిత సాహిత్యోద్యమంలో ఒకడి గా చేరే అవకాశం తనకు కలిగిందని’ వినయంగా చెప్పుకొన్నారు. ఆయన రచనల్లో సమసమాజం పట్ల అచంచల స్వప్నం, కుల నిర్మూలన పోరాటం కనిపిస్తుంది. బలంగా వినిపిస్తుంది.

కలేకూరి ‘కాలానికి నిలబడగలిగే శక్తి ఉంటాయి. లేకపోతే లేదు’ అంటారు తన కవిత్వం (kalekuri prasad kavithalu) గురించి. కాని, నిజానికి కాల ప్రవాహంలో స్థిరంగా నిలిచిన కవిత్వాన్నే ఆయన సృజియించా రు. ‘పునరావృతమవుతున్న వర్తమానంలో ఈ కవిత్వం ప్రాసంగితను గురించి ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదని’ ప్రసాద్ కవిత్వానికి పుస్తక రూపమిచ్చిన నామాడి శ్రీధర్ అంటారు.
వర్తమాన పరిస్థితులలో కలేకూరిని నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకోవలసిన అవసరం ఉంది. కులం, మతం, వర్గం, జాతి ఇలా విభజనలు ముమ్మరం గా చాపకింద నీరులా దేశం అంతటా విస్తరిస్తున్న వేళ ‘హింస’ ఓ అంతర్లీన సూత్రంగా అన్నింటా కొనసాగుతున్న సందర్భంలో కలేకూరి ప్రసాద్ ఓ కవితలో మానవీయ సమాజం/కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, వ్యక్తులుగా/ఒంటరులుగా నిర్వీర్యమవుతోంది. అది హింస/ ఏ బలిపీఠమైనా గొర్రెపిల్లల కోసమే తయారవుతుంది/ఏ బలిపీఠం పైన ఏ గొర్రె పిల్ల బలైనా/అది ‘ఐచ్ఛికా’ర్పణే!’ అంటారు.

‘ఈశ్వరి’ సృ్మతిలో రాసిన కవితలో ‘నా తల్లీ! / హింసోన్మత నిన్ను జీవితం కొనదాకా / తరిమితరిమి హత్య చేసింది / కాలం సాక్షిగా మిగిలిపోయింది. ఇలా నినదిస్తూనే తన అక్షరాల్లో ‘ఆమె’ను ఎత్తుకుంటానంటారు. ‘కళ్ళలో మెరిసే ఎర్రని జీరల్లో నిన్ను నిలుపుకుంటాం’ ఇది కలేకూరి వారి కవితల్లో కనిపించే త్రీవ్రమైన హెచ్చరిక. ప్రపంచం ఓ భ్రమల వ(వి)లయం. ఇక్కడ ప్రతిభ సహితం వర్గీరణల మధ్య వర్ణణాత్మకంగా మిగిలిపోతుందంటారు కవి. ‘పీఠాథిపతుల ప్రవచనాల ప్రభంజనాలు /లోకాన్ని ముంచెత్తుతున్నట్లు గుండెలు జలదరిస్తున్నవి’ ప్రతిభకున్న వివిధ ‘వేషాల చిత్రాలను దృశ్యరూపం’ చేసిన ధీశాలి కలేకూరి ‘ఇప్పుడు ప్రతిభ/రెక్కలు చాస్తోన్న మూర్తిభవించిన రాజ్యహింస’ అని ఆవేదనగా ‘గర్జన’ చేస్తారు. కుర్చీల కోసం మారణహోమం సృష్టి ‘రాజ్యానికి’ ఓ క్రీడ. ఇందుకు ఎన్నో మార్గాలున్నాయి.

చిన్న, పెద్ద, కుల, వర్గ, మత, వృద్ధ, స్త్రీ అనే తారతమ్యం లేదు. కావలసినదల్లా ‘కుర్చీ’ పదవి. కలేకూరి సహితం ఇది చూసి సహించలేక ‘ఒక కుర్చీని మార్చడం కోసం / వేలాది పసిప్రాణాలను కాల రాచే / చాకచక్యం తెలియదు నాకు’ అంటారు. అక్షరాలను ఆయుధాలుగా మలచి ప్రయోగించిన కలం కలేకూరి స్వంతం. ప్రసాద్ వ్యంగ్యంగానే అయినా ‘18 డిసెంబ ర్ 1996’ నాటి సంఘటనకు జత చేసిన విధం, ఆయనలోని సత్యసంధత చదువరి హృదయంలో కలవరం కలకలం కలిగిస్తుంది. కవిత్వ ప్రయోజనమేమిటి అని ప్రశ్నించే వారికి కలేకూరి కవిత్వం ‘నగ్నంగా సత్యాలను’ చూపిస్తుంది. తట్టుకొనే ధైర్యం, నిజాయితీ చదువరికి అవసరం. సా ధించిన ‘స్వాతంత్య్రం’ తమ వారిని ఇంకా ‘సమాజానికి’ దూరంగా ‘ఆధునికతను జతచేసి వేరుగా జీవింపజేయటం కూడా అవమానమంటారు.

‘నాసొరాజ్జమా!/నీకు యాభైఏళ్ళు నిండిన తర్వాత/ ఇప్పుడు నువ్వంటే/అమితమైన ప్రేమ పుట్టుకొస్తున్నది/ఒక్కసారి రావే../మా మాలమాది గ గూడెల దాకా’ అంటూ 1996లో రాసిన కవిత (kalekuri prasad kavithalu) మన గుండెలనుమండిస్తుంది. జీవితానుభవాలు కళ్ళకు కట్టిన దృశ్యాలు, సామాజిక అసమానతల కొలిమిలో అవమానాల మంటల వేడిమిని భరించలేని వ్యక్తి సమాజంను ప్రశ్నించేతత్వం కవిత్వంలో ప్రతిఫలిస్తే అది కలేకూరి ప్రసాద్ అగ్నిధారల కుంభవృష్టి అవుతుంది. కదిలిస్తుంది. కన్నీరును తెప్పిస్తుంది. కళ్ళంట మంటలను కురపిస్తుంది. కవి, అనువాదకుడు, పాత్రికేయుడు, సామాజిక, రాజకీయ కార్యకర్తగా కలేకూరి బహుముఖీయప్రజ్ఞ వెనుక చిన్నతనంలో స్వగ్రామలో జరిగిన కంచికర్ల కోటేశు అనే బాలుడి సజీవ దహన దృశ్యం అదృశ్య శక్తిగా ఉందనేది విస్మరించరానిది. ఆ సంఘటన ప్రేరణ నుండి అతనొక ‘మహాశక్తిగా’ ఎదిగిన క్రమం గొప్పది. అతని కవిత్వం గాఢత్వంతో నిండి ఉంటుం ది. ఆర్ధ్రత, అంతర్ముఖత, స్పష్టత, కోపోద్రిక్తత, అధిక్షేపం, అంబేద్కర్ భావాజాలాల సమ్మేళన సమ్మోహన రూపం కలేకూరి కవిత్వం’. 2013 మే 17 కలేకూరి కానరాని లోకాలకు తన కలంతో తనవారి కతలను, వ్యధలపై ప్రశించడానికి పయనం సాగించాడు.
‘నాదు కన్నీటి కథా సమన్వయము సేయు
నార్థ్ర హృదయంబు గూడ కొంతవసరంబు’
అనే జాషువా వాఖ్యానం ఈ సందర్భంలో గుర్తుకు రాకమానదు.
భమిడిపాటి గౌరీశంకర్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News