Wednesday, May 21, 2025

కెసిఆర్ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

రాజకీయ కక్షతో కెసిఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోతున్నామని ఎంత బాధ పడ్డామో అందరికీ తెలుసు అని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మొదటి నుంచి కడుపు మంటగా ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ బాగుపడటం, పేదలు బాగుపడటం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఇష్టం ఉండదని, ప్రజలు ఎప్పటికీ పేదరికంలో ఉంటేనే తమకు పదవులు వస్తాయని భావించే నాయకత్వం కాంగ్రెస్ పార్టీది అని మండిపడ్డారు.

తెలంగాణలో బీడు భూములన్నింటికీ నీళ్లు వచ్చేలా కెసిఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కుట్రలు పన్నుతూ అనేక కేసులు వేసిన విషయం కూడా ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అదే కుట్రలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లు రావడం.. ఆ వెనువెంటనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌డిఎస్‌ఎ అధికారులు పడవల్లో వచ్చి ఫొటోలు తీసి ప్రచారం చేసిన విషయం కూడా అందిరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలందరినీ కన్ఫ్యూజన్‌కు గురి చేశారని, ఈ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి తన జీవితాన్ని పణంగా పెట్టిన కెసిఆర్‌పై కాంగ్రెస్ చేస్తోన్న కుట్రల్లో భాగంగానే ఆయనకు నోటీసులు ఇచ్చారని అన్నారు.

తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఆమరణ నిరాహార దీక్ష చేసిన నాయకుడు కెసిఆర్ అని ఆమె గుర్తు చేశారు. కెసిఆర్ ప్రతిష్టను, ఆయన పేరును దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కమిషన్లు ఏర్పాటు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కోసం నిర్మించిన ప్రాజెక్టు అన్న విషయం గుర్తించాలని తెలిపారు. రాజకీయ కుట్రతో, కక్షతో వేసిన ఇలాంటి కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్నే గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే నిజాలన్ని బయటకు వస్తాయని.. పాలు ఏవో.. నీళ్లు ఏవో ప్రజలకు స్పష్టత వస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News