Thursday, September 4, 2025

కాళేశ్వరం మలుపులు.. మరకలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు ఆది నుంచి అనేక వివాదాలతో మలుపులు తిరుగుతూ చివరకు కవిత సస్పెన్షన్‌కు దారి తీసింది. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఒకవైపు విచారణ పేరిట ప్రభుత్వం నుంచి ఎదురైన సవాళ్ళతోపాటు కన్న బిడ్డ ఆరోపణలతో మరింత దిగాలు పడాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణలు వస్తే గిట్టని వారు చేసారంటూ దాట వేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ సొంత బిడ్డనే అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని ఆరోపణ చేయడంతో అవతలి పార్టీలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లే. దీంతో కెసిఆర్ పేగు బంధాన్ని తెంచుకుని, దుఃఖాన్ని దిగమింగారు. కన్న బిడ్డే కదా అంటూ ఇంకా చూస్తూ జాప్యం చేస్తే ఆరోపణలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. అవినీతి అనకొండ అంటూ భారీ ఆరోపణలు చేయడంతో ఇక చేసేది లేక కెసిఆర్ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు.

ఆడ బిడ్డ పెళ్ళి ఎంతో సంతోషంగా, అంగరంగ వైభవంగా చేసినా అప్పగింత సమయంలో నిన్నటి వరకు అల్లారు ముద్గుగా ఉన్న బిడ్డ అత్తారింటికి పోతున్నదని, ఈ ఇంటి గడప దాటి ఆ గడపలోకి వెళుతుందని, ఎన్ని కష్టసుఖాలు పడుతుందోనన్న భావనతో తల్లిదండ్రుల కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఆ పెళ్ళి కుమార్తె కూడా తల్లిదండ్రులను కౌగిలించుకుని ఒకవైపు సంతోషం, మరోవైపు కన్న తల్లిదండ్రులను వదిలి వెళుతున్నానన్న బరువెక్కిన గుండెను నిబ్బరం చేసుకుని భర్త చేయి పట్టుకుని అడుగు ముందుకేస్తుంది. ఇప్పుడు సస్పెన్షన్ వేటుతో కవితను ‘కారు’ దించేయడంతో నా బిడ్డ రాజకీయ జీవన గమ్యం ఎలా ఉంటుందోనన్న బెంగ తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ బిఆర్‌ఎస్ రాజకీయ పార్టీ. ఎక్కువ కాలం భరిస్తే పార్టీకి భారీ నష్టం. ఇప్పటికే నష్టం జరుగుతుందన్న గుసగుసలు పార్టీలో ఆరంభమయ్యాయి.

ఆమె చేసిన వ్యాఖ్యలే మరెవరైనా చేసి ఉంటే గంటలోపే పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడకమానదన్న గుసగుసలు. ఈ సమయంలో కెసిఆర్ మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటారన్నది ఊహించవచ్చు. బిడ్డ వ్యాఖ్యలు పార్టీ బలోపేతానికి ఉపయోగపడాలే తప్ప కృంగిపోయేలా, నష్టం జరిగేలా ఉండకూడదు. నాన్న చుట్టూర దెయ్యాలు ఉన్నాయంటూ బహిరంగ విమర్శలు చేయడంతోనే పార్టీలోని నాయక, ద్వితీయ శ్రేణి, కార్యకర్తలు హతాశులయ్యారు. ఇతర పార్టీ నేతలు, ప్రజలు బిఆర్‌ఎస్ కలహాల కాపురం అంటూ జరుగుతున్న పరిణామాలపై ఆసక్తి పెంచారు. నాన్నకు ప్రేమతో అంటూ దెయ్యాల కథ చెప్పడం కుంపటి రాజుకుంది. మొన్నటి వరకూ అన్న కెటిఆర్‌నే టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు తన బాణం దిశ మార్చి బావ, మాజీమంత్రి టి. హరీశ్ రావు పైకి వదిలారు. వదిలిన బాణం సాధారణమైందేమీ కాదు.

అవినీతి అనకొండ అంటూ బ్రహ్మాస్త్రానే ప్రయోగించారు. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే శత్రువే కాదు వాతావరణంపై ప్రభావం పడి, భూప్రకంపనాలు తలెత్తుతాయని పురాణాల్లో ఉంది. కవిత వ్యాఖ్యలూ అటువంటి విస్ఫోటనం జరిగినంతగా పార్టీని కుదిపేసింది. ఇక కాంగ్రెస్, బిజెపి నేతలు చాలా కాలంగా కాళేశ్వరం అవినీతి లక్ష కోట్లు అంటూ ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సర్కారు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌ను నియమించి, విచారణ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించడం, సిబిఐ విచారణకు నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాయి. అసెంబ్లీలో ఎంఎల్‌ఎల అభిప్రాయాల మేరకు కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని అందరి ఊహగానాలను, అంచనాలను తలకిందులు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది.

సిబిఐ విచారణ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి, బిఆర్‌ఎస్‌లను ఇరకాటంలో పెట్టి బంధించే అస్త్రాన్ని సంధించారు. రెండు పార్టీలను ఎండగట్టడమే వ్యూహం. ఇంతకాలం సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన బిజెపి ఇప్పుడు ఎంత వేగంగా పావులు కదుపుతుందో చూద్దామన్నది ముఖ్యమంత్రి భావన. విచారణను త్వరితగతిన పూర్తి చేయించి కెసిఆర్‌ను, హరీశ్‌రావును దోషులుగా నిలబెట్టగలిగితే ముఖ్యమంత్రి వ్యూహం ఫలించినట్లే. అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బిజెపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్న ఆలోచన. ఒకవేళ సిబిఐ విచారణ వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ తాత్సారం జరిగితే బిఆర్‌ఎస్‌ను కాపాడుతున్నదే బిజెపియేనని, రాబోయే ఎన్నికల్లో బిజెపి బిఆర్‌ఎస్ ‘దోస్తీ’కి సిద్ధమయ్యారని ఆరోపించేందుకు ఆస్కారం ఉంటుంది.

ఇప్పుడు సిబిఐ విచారణకు కోర్టు అనుమతించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ వచ్చే నెల 7వ తేదీన వాదనలు వింటామని కోర్టు చెప్పడంతో వారికి కొంత ఉపశమనం లభించింది.  ప్రభుత్వమే పిసి ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తే అయిపోయేదన్న కొందరి ఆలోచన, అభిప్రాయం. కానీ అలా చేసి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్‌ఎస్‌పై కక్ష కట్టిందన్న ‘మరక’ పడుతుందని ముఖ్యమంత్రి భావించారు.ఎవరి ఊహలకు అందని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పొరపాటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయదలచుకోలేదన్నది నిగూఢ అంతరార్థం. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడును జైలుకు పంపించడంతోనే అనూహ్యంగా రాజకీయాలు మలుపులు తిరిగాయి.

చంద్రబాబుపై ఊహించని విధంగా ఒకవైపు సానుభూతి, రెండవ వైపు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ జైలుకెళ్ళి చంద్రబాబును పరామర్శించారు. అంతటితో ఆగకుండా జైలు బయటకు రాగానే మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వ దుశ్చర్యలను ఎండగడుతూ, ఇక మీదట తామూ తెలుగు దేశం పార్టీతో జత కడతామని సంచలన ప్రకటన చేశారు. ఆ వెంటనే బిజెపికి కూడా కలవడంతో ముచ్చటగా మూడు పార్టీలూ కలిసి కూటమిగా ఏర్పడి అధికారాన్ని అందిపుచ్చుకున్నాయి. ఆ తప్పును తాను చేయకూడదని, కెసిఆర్‌ను జైలుకు పంపించి సానుభూతి పొందేలా చేయకుండా, తన వ్యూహంలో భాగంగా బాణాన్ని బిజెపివైపు మరల్చారు. ఆ బాణాన్ని బిజెపి ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం.

Also Read : భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు: టిటిడి

  • వీరన్నగారి ఈశ్వర్‌రెడ్డి
    98499 98086

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News