తండ్రిని చంపిన హత్య కేసులో డిండి చింతపల్లిలో దొరికిన బాలయ్య మృతదేహం
ఆస్తి తగాదాలతోనే హత్య
కుటుంబ సభ్యులు
మన తెలంగాణ/ కల్వకుర్తి రూరల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో మానవత్వాన్ని మరిచిపోయేలా దారుణం వెలుగులోకి వచ్చింది. కల్వకుర్తి పట్టణంలోని వాసవి నగర్‌కు చెందిన బాలయ్య(70) తన సొంత కుమారుడు బీరయ్య చేతిలో హత్యకు గురయ్యాడు. బీరయ్య ఆస్తి కోసం విచక్షణారహితంగా తండ్రి బాలయ్యపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. అంతటితో ఆగక, తండ్రి శవాన్ని కారు డిక్కీలో వేసుకుని చింతపల్లి బ్రిడ్జి వద్ద పడేసాడు. బాలయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
Also Read: ఉరుమురిమి హరీశ్‌పైనా?
పోలీసులకు సమాచారం అందించగానే సిఐ నాగార్జున, ఎస్సై మాధవ రెడ్డి బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. అక్కడి రక్తపు మరకలు, సిసి కెమెరా ఫుటేజీలు నిజాన్ని బయటపెట్టాయి. బీరయ్యే నిందితుడని పోలీసులు ధృవీకరించారు. తర్వాత పోలీసులు బీరయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా శవాన్ని నదిలో పడేసానని ఒప్పుకున్నాడు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టగా శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఉప్పునుంతల మండలంలోని కొరటికల్లు గ్రామ సమీప వాగులో తలలేని మృతదేహం లభ్యమైందని సిఐ నాగార్జున, ఎస్సై మాధవ రెడ్డి తెలిపారు. కొద్ది నెలల క్రితం బీరయ్య కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం, ఇప్పుడు తండ్రిని చంపిన ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. బంధాలు, బంధుత్వాలు అనే విలువలు కరిగిపోయాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.