స్టార్ హీరో కమల్‌హాసన్ (Kamal Hassan) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life) ఈవెంట్‌లో భాగంగా కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. దీనిపై కర్ణాటకలో ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా కర్ణాటక బిజెపి అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప నటుడి తీరుపై మండిపడ్డారు. మాతృభాషను గౌరవించడం కోసం మరో భాషను కించపరచాల్సిన అవసరం లేదన్నారు.
భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కన్నడ భాష కొన్ని శతాబ్ధాలుగా మనుగడలో ఉందని పేర్కొన్నారు. దక్షిణాదిలో సోదరభావాన్ని పెంచాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి.. కొన్నేళ్లుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఎన్నో సినిమాల్లో నటించిన కమల్ (Kamal Hassan) ఇలాంటి మాటలు మాట్లాడటం దురదృష్టకరమని.. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా విజయేంద్ర డిమాండ్ చేశారు.
‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ని ఉద్దేశిస్తూ కమల్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ నాకు కుటుంబం ఉంది.. అందుకే వచ్చాను.. కన్నడ భాష కూడా తమిళం నుంచి పుట్టింది’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. థగ్ లైఫ్ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో త్రిష, శింబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది.