అర్ద రాత్రి దాక రోడ్ల మీదే పహారా
నిజామాబాద్: కామారెడ్డి జిల్లాను వరద ముంచెత్తడంతో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సహాయక చర్యల కోసం స్వయంగా రంగంలోకి దిగారు. అర్ద రాత్రి దాక ఆయన జాతీయ రహదారి మీదే పహారా చేశారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుండి వరద నీరు ఎక్కువగా ప్రవహించడం వలన రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. అసలే జాతీయ రహదారి కావడంతో దాదాపు ఆరుగంటల పాటు వాహనాలను నిలిపి వేయడంతో దాదాపు పది కిలో మీటర్ల మేరకు ఆయా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు ఇరువైపుల నిలిచి పోయాయి.
కమిషనర్ సాయి చైతన్య రంగంలోకి దిగి జాతీయ రహదారి మీద వరద నీరు రాకుండా నియంత్రించడంతో పాటు వాహనాల రాకపోకలను పున ప్రారంభించారు. ఒక వైపు నుంచే వాహనాలు వెళ్లేలా చేశారు . ఈ సందర్భంగా వాహనదారులు కాస్త సమయన్వయం పాటించాలని వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందువలన సంబంధిత పోలీసు వారికి సహకరించాలన్నారు. భారీ వర్షంలోనే ఆయన కామారెడ్డి ఎస్పీ అదనపు కమిషనర్ బస్వా రెడ్డి లతో కలిసి వాహనాల రాకపోకలు క్లియర్ చేయడంతో వాహన దారులు వారిని ప్రశంసించడంతో పోలీసుల సేవలను కొనియాడారు. వర్షానికి కూడా లెక్కచేయకుండా విధులు నిర్వహించి తమ గమ్యానికి చేరే విధంగా కృషి చేసారంటూ కితాబు ఇచ్చారు.