Tuesday, September 9, 2025

15న కామారెడ్డిలో కాంగ్రెస్ సమర భేరి

- Advertisement -
- Advertisement -

వివిధ కారణాలతో కాంగ్రెస్‌ను వీడిన నాయకులను, ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ ఆకర్ష్’ను చేపట్టాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించబోయే ‘సమర భేరి’ భారీ బహిరంగ సభకు లక్షకు తగ్గకుండా జనసమీకరణ చేయాలని నిర్ణయించింది.
సోమవారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్పోరేషన్ల చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించబోయే బహిరంగ సభను జయప్రదం చేయడంపైనే చర్చించారు.

బిఆర్‌ఎస్ కకావికలంః డిప్యూటీ సిఎం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రసంగిస్తూ బిఆర్‌ఎస్ కకావికలమవుతున్నదని, ‘కారు’ ఎన్ని ముక్కలవుతుందోనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గ్రామ, మండల స్థాయిలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వస్తున్న వారికి స్వాగతం పలకాలని అన్నారు. ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి అందరమూ కలిసి పని చేద్దామన్నారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావడం చాలా అవశ్యకతం ఉందని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు ఏదో ఒక పదవి లభిస్తుందని, పార్టీ గుర్తింపునిస్తుందని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చా కేవలం, సంక్షేమ కార్యక్రమాలకు రూ. 99,529 వేల కోట్ల ఖర్చు చేశామని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాము మొదటి నుంచి చెబుతున్నామని, ఇప్పుడు కెసిఆర్ కుమార్తె కవిత చాలా స్పష్టంగా చెప్పారని భట్టివిక్రమార్క తెలిపారు.

జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశంః మీనాక్షి
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రసంగిస్తూ ఇకమీదట పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాలను జిల్లాల్లో నిర్వహించుకుందామన్నారు. తాను ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి రెండు నెలలకు ఒకసారి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగడం సంతోషకరమని ఆమె తెలిపారు. ప్రతి కమిటీలో సామాజిక న్యాయం పాటించామని ఆమె చెప్పారు. నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారికి 70 నుంచి 80 శాతం మందికి ఇస్తామని, మిగతా శాతం కొత్తగా వివిధ పార్టీల నుంచి చేరిన వారికి ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణను ఆదర్శంగా దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కొంత కష్టమే అయినా కాంగ్రెస్ అందుకు సిద్ధంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒసి అయినప్పటికీ బలహీనవర్గానికి చెందిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి సమన్వయంతో ముందుకెళుతున్నారని ఆమె ప్రశంసించారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి సారించామని చెప్పారు. డిసిసి కమిటీల నియామకాలు వచ్చే వారంలో పూర్తి చేయనున్నట్లు మీనాక్షి వివరించారు. కామారెడ్డిలో నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని ఆమె సూచించారు.

దేశానికి తెలంగాణ ఆదర్శంః పిసిసి చీఫ్
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలూ విస్తుపోయేలా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లో అన్ని వర్గాల వారు బిసి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు. పదవే పరమావధిగా భావించే ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర హోం మంత్రి అమీత్ షా ఓట్ చోరీకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని ఆయన విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ఎన్డీయే ఇప్పటి వరకు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ ఖేల్ ఖతం..
వచ్చే ఎన్నికల నాటికి బిఆర్‌ఎస్ ఖేల్ ఖతం అవుతుందన్నారు. కెసిఆర్ కుటుంబం దొంగల ముఠా అని ఆయన దుయ్యబట్టారు. కారులో డీజిల్ పోసుకోలేని కెసిఆర్ కుటుంబం, అవినీతి సొమ్ముతో వందల కోట్లకు పడగలెత్తిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అపభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నానని అన్నారు. మీనాక్షి గాంధీ నిజాయితీకి నిలువెత్తు రూపం అని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.

కామారెడ్డి సభతో సత్తా చూపిద్దాంః పొన్నం
కామారెడ్డిలో నిర్వహించబోయే సమర భేరి సభను విజయవంతం చేసి సత్తా చూపిద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ బిసిలకు పిలుపునిచ్చారు. ఈ వేదిక ద్వారా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సమావేశానంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నుంచి వివిధ సందర్భాల్లో వేరే పార్టీలోకి వెళ్ళిన వారంతా తిరిగి సొంత గూటికి చేరేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన జన హిత యాత్రను త్వరలో మళ్లీ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని తాము ఇంత కాలం చేసిన ఆరోపణలు వాస్తవమేనని స్వయాన కెసిఆర్ కుమార్తెనే చెప్పారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News