డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.ఎం.మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో విష్ణు మంచు, కన్నప్ప టీం మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు మాట్లాడుతూ .. “కన్నప్ప చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడాలని కోరుకుంటున్నాను. అందుకే నేను టికెట్ రేట్లు పెంచడం లేదు. ఈ మూవీని పిల్లలే ఎక్కువగా చూడాలని అనుకుంటున్నాను. అందుకే కుటుంబాలకు భారం కావొద్దని టికెట్ రేట్లు ఎక్కువగా పెంచడం లేదు. ఏపీలో కొన్ని చోట్ల మాత్రమే పెంచాం. ప్రభాస్‌కి ఇప్పటికే నేను ఎంతో రుణపడి ఉన్నాను.
ఆ దేవుడి దయవల్ల నేను కన్నప్ప విషయంలో ఎప్పుడూ ఆర్థిక కష్టాల్ని ఎదుర్కోలేదు. నా తండ్రి మోహన్ బాబు, విజయ్, వినయ్ నా వెన్నంటి ఉండి అంతా చూసుకున్నారు. కన్నప్ప కోసం మా టీం పడినంత కష్టాన్ని నేను అయితే పడలేదు. నా నలుగురు పిల్లలు ఈ చిత్రంలో నటించారు. ఓ తండ్రిగా నా పిల్లల్ని తెరపై చూడటం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో ఎవ్వరినీ ఎక్కడా కూడా అగౌరవపర్చలేదు. దేవుడు, భక్తుడికి మధ్యలో ఎవ్వరూ ఉండాల్సిన పని లేదు, మూఢ నమ్మకాలు అవసరం లేదు అని చెప్పడమే ఈ చిత్రం ఉద్దేశం. దేవుడి మీద మనసారా భక్తి ఉంటే చాలు అని చెప్పాలని అనుకున్నాం. ‘కన్నప్ప’ స్క్రిప్ట్ మీదున్న నమ్మకంతోనే ఇంత బడ్జెట్ పెట్టి, రిస్క్ చేసేందుందుకు ముందుకు వచ్చాం. ఈ చిత్రంలో మోహన్‌లాల్ పాత్ర చాలా సర్ ప్రైజింగ్‌గా, షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది. ‘కన్నప్ప’ కథ కల్పితం కాదు.. మన చరిత్ర. మన మధ్యలో జీవించినవాడు.
కన్నప్ప ఉన్నారు.. ఇప్పటికీ ఆయన్ను ఆరాధిస్తుంటారు” అని అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ .. “కన్నప్ప చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించాం. ఇక ఇప్పుడు మేం మా పనికి తగ్గ ప్రతిఫలం వస్తుందా? అని ఎదురుచూస్తున్నాం. కన్నప్ప గురించి ఇప్పటి తరానికి ఎక్కువగా తెలియదు. భక్తి, దేవుడు అనే వాటి మీద నమ్మకం లేని వ్యక్తి.. చివరకు గొప్ప శివ భక్తుడిలా ఎలా మారాడు? అన్నది ప్రపంచానికి తెలియజేయాలని ఈ ‘కన్నప్ప’ సినిమాను తీశాం. ఇందులో ప్రతీ పాత్రకు అందరూ ప్రాణం పెట్టి నటించారు. పూర్తి నిర్మలమైన మనసుతో సినిమాను చూడండి. మీరిచ్చే తీర్పుని గౌరవిస్తాను” అని తెలిపారు. శివ బాలాజీ మాట్లాడుతూ .. “భూమి మీద అతి సుందరమైన ప్రదేశంలో(న్యూజిలాండ్) షూటింగ్ చేశాం. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి సినిమాలు చేయడం, నిర్మించడం అంత సులభం కాదు. కన్నప్ప సినిమా అద్భుతంగా ఉంటుంది” అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నటుడు కౌశల్, కెమెరామెన్ షెల్డన్ చౌ పాల్గొన్నారు.