బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే, వికాస్ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో క్యాట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం బుధవారం హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎస్జీ పండిట్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ముందు అడ్వకేట్ జనరల్ కె. శశికరణ్ శెట్టి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరపనున్నట్లు కర్ణాటక హైకోర్టు తెలిపింది.
కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ పరేడ్ సందర్భంగా బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట 11 మంది క్రికెట్ అభిమానులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఘటనపై దర్యాప్తుకు ప్రభుత్వం ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది. తర్వాత ఈ ఘటనకు సంబంధించిన అదనపు పోలీసు కమిషనర్ ఐపీఎస్ వికాస్ కుమార్ తోపాటు పలువురు అధికారులను సిద్దరామయ్య ప్రభుత్వం సస్పెండ్ చేసింది.