టీం ఇండియా క్రికెటర్ కరుణ్ నాయర్ (Karun Nair) కీలక నిర్ణయం తీసుకున్నాడు. విదర్భ జట్టుకు కరుణ్ గుడ్‌బై చెప్పేశాడు. వచ్చే దేశవాళీ సీజన్‌లో తిరిగి కర్ణాటక జట్టు తరఫున ఆడేందుకు అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2022లో కరుణ్ కర్ణాటక నుంచి విదర్భకు మకాం మార్చాడు. ఆ తర్వాత వచ్చిన రెండు సీజన్లలో (2023, 2024) అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా 2024-25 రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు.
గత రంజీ సీజన్‌లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంతో కరుణ్ (Karun Nair) పాత్ర ఎంతో ఉంది. 16 ఇన్నింగ్స్‌లో 53.93 సగటుతో 863 పరుగులు చేశాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో కూడా అతను అద్భుతంగా రాణించాడు. ట్రోఫీలో మొత్తం 779 పరుగులు చేశాడు. కానీ, విదర్భగా ఆ సీజన్‌లో రన్నర్‌ఆప్‌గా నిలిచింది. వీటి కారణంగానే అతనికి ఎనిమిదేళ్ల తర్వాత టీం ఇండియాలో చోటు దక్కింది. కానీ, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అతను తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు.